న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో నిర్వహిస్తే శ్రేయస్కరమని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. దీనివల్ల తదుపరి తరం సర్వీసులకు ఉండే డిమాండ్, ఆదాయ అవకాశాలు మొదలైన వాటన్నింటినీ అంచనా వేసుకునేందుకు టెల్కోలకు వీలు చిక్కుతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అలాగే, 5జీ స్పెక్ట్రం ధర కూడా వేలం విషయంలో కీలకంగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న టెలికం సంస్థలు 5జీ స్పెక్ట్రం వేలంపై ఎంత వెచ్చించగలవన్నది కూడా చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం టెలికం పరిశ్రమ సుమారు రూ. 7.7 లక్షల కోట్ల మేర రుణభారంలో ఉంది. కొత్త సంస్థ రిలయన్స్ జియో చౌక ఆఫర్లతో పలు దిగ్గజాల ఆదాయాలు, లాభాలు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. మరింత వేగవంతమైన టెలికం సర్వీసుల కోసం ఉద్దేశించిన 5జీ టెక్నాలజీ అమల్లో అన్ని దేశాల కన్నా ముందుండాలని భారత్ నిర్దేశించుకుంది.
ఇందులో భాగంగా తగు మార్గదర్శ, కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు టెలికం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల కార్యదర్శులతో అత్యున్నత స్థాయి కమిటీని కూడా వేసింది. సుమారు 12 బ్యాండ్‌లలో దాదాపు 6,000 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయొచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment