సాక్షి, బెంగళూరు: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయమనుంది. రాబోయే కొద్ది త్రైమాసికాల్లో 7వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టడం తో సహా, కొన్ని వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఇది మరో 6000 మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కంపెనీ తెలిపింది.
కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుండి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో విశ్లేషకులతో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పాత్రల నుండి తొలగించనున్నామని వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని కంపెనీ అధికారులు తెలిపారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా ఉన్న కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందనీ, అయితే కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment