Cognizant Technology
-
కాగ్నిజెంట్‌లో కొలువుల జాతర: లక్ష ఉద్యోగాలు
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లోఆన్బోర్డింగ్ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్ ఇస్తామన్నారు. అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకో నున్నట్టు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్‌బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్‌ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్సేషన్, సర్దుబాట్లు, ఉద్యోగ భ్రమణాలు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లు లాంటి చర్యలపై దృష్టిపెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ త్రైమాసికంలో డిజిటల్ రెవెన్యూ వృద్ధి సంవత్సరానికి 20 శాతానికి పెరిగిందని వెల్లడించిన ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్నారు. మూడవ త్రైమాసిక ఆదాయం 4.69 - 4.74 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండనుందని, 10.6-11.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ సీగ్మండ్ చెప్పారు. కాగా జూన్ 2020 త్రైమాసికంలో కాగ్నిజెంట్ 41.8 శాతం వృద్దితో, 512 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 3,802 కోట్లు) నికర ఆదాయాన్ని నివేదించింది. అలాగే 10.2-11.2 శాతం (స్థిరమైన కరెన్సీలో 9-10 శాతం) వృద్ధి అంచనాలను ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. -
23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ
ముంబై, సాక్షి: వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలియజేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అధిక శాతం భారత్‌కే అవకాశముంటుందని కాగ్నిజెంట్ ఇండియా ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాగ్నిజెంట్ బోర్డు సభ్యులైన నంబియార్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ నిర్దేశనలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు నంబియార్ తెలియజేశారు. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికంకాగా.. వీటిలో సింహభాగం భారత్ నుంచే ఎంపికలు జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) పలు బాధ్యతలు కాగ్నిజెంట్ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ కమిటీకి సైతం నంబియార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. దేశీ ప్రభుత్వ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో కాగ్నిజెంట్‌కున్న ఒప్పందాలను మరింత మెరుగు పరచవలసిన బాధ్యత నంబియార్‌పై ఉన్నట్లు పరిశ్రమ నిపుణులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్టపరచడం, నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా యూనివర్శిటీలతో భాగస్వామ్యలు ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలను నంబియార్ సాధించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు, నాస్కామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ సంబంధిత సంస్థలతోనూ కలసి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వివరించారు. -
లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు..
హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే ఆందోళనతో హైదరాబాద్‌లో 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హరిణి ఆత్మహత్య టెకీల్లో కలవరం రేపుతోంది. వేతన పెంపు, లేఆఫ్స్‌కు సంవత్సరాంతం అనువైన సమయం కావడంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే గుబులు ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. ఆర్థిక మందగమనంతో ఉద్యోగుల తొలగింపుపై సర్వత్రా ఆందోళన నెలకొన్న క్రమంలో ఉద్యోగులకు బాసటగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ముందుకొచ్చింది. దాదాపు ప్రతి ప్రాజెక్టులో 18 శాతం ఉద్యోగులకు 4 రేటింగ్ ఇచ్చారని, అంటే వీరంతా 45 నుంచి 60 రోజుల్లో తమ సామర్ధ్యం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని అసోసియేషన్ సభ్యులు సందీప్ కుమార్ మక్తానా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అసోసియేషన్‌తో పంచుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంస్థల్లో సభ్యత్వాలు తీసుకునేందుకు ఐటీ ఉద్యోగులను ఆయా కార్పొరేట్ సంస్థలు అనుమతించడం లేదు. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కంపెనీలు అనుమతించవని, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తాము ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏ ఒక్కరూ సాయం చేయరని ఓ ఉద్యోగి వాపోయారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ 13,000 మందిని సాగనంపుతూ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు దిగడం ఐటీ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది. వీరిలో అత్యధికులు మధ్యశ్రేణి, సీనియర్ పొజిషన్స్‌లో పనిచేస్తున్నవారే. ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఇదే ట్రెండ్ నెలకొనడంతో అది ఉద్యోగుల శారీరక, మానిసిక, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల అభద్రతాభావం కుంగుబాటుకు చివరికి ఆత్మహత్యలకూ దారితీస్తోంది. ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగంగా యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా వారి సామర్ధ్యం సరిగ్గాలేదని చూపే ప్రయత్నం చేస్తోందని ఐటీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులను నిందించే బదులు నూతన ప్రాజెక్టులు లేదా క్లోజ్ చేసిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టిసారించాలని హితవు పలికింది. మరోవైపు ఉద్యోగులను తొలగించే క్రమంలో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న రెండు నెలల పరిహార ప్యాకేజ్‌ను ఆరు నెలలకు పెంచాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో ఐదు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరిలో అత్యధికంగా మధ్యశ్రేణి ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. -
కాగ్నిజెంట్ నిర్ణయంతో టెకీలకు షాక్..
బెంగళూర్ : ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతుండటంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ గరిష్ట పరిమితిని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్‌ను 60 రోజుల నుంచి 35 రోజులకు కాగ్నిజెంట్ తగ్గించింది. 35 రోజుల తర్వాత బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను కంపెనీ సాగనంపుతుంది. ఈ ప్రక్రియ 60 నుంచి మూడు నెలల లోపు పూర్తవుతుంది. గతంలో బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్ టైమ్‌ను కంపెనీ కల్పించేది. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని వారు మాత్రమే కంపెనీని వీడాల్సివచ్చేది. బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు పలు అవకాశాలు ఇవ్వకుండా నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునే నైపుణ్యాలను వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్ నూతన బెంచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. సంవత్సరాల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్ వృద్ధి రేటు ఇటీవల పడిపోవడంతో తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు పలు చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలను సంతరిచుకునేలా కసరత్తు చేపట్టింది. -
7 వేల సీనియర్ ఉద్యోగులపై కాగ్నిజెంట్ వేటు
సాక్షి, బెంగళూరు: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయమనుంది. రాబోయే కొద్ది త్రైమాసికాల్లో 7వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టడం తో సహా, కొన్ని వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఇది మరో 6000 మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కంపెనీ తెలిపింది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుండి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో విశ్లేషకులతో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పాత్రల నుండి తొలగించనున్నామని వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని కంపెనీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా ఉన్న కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందనీ, అయితే కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధి చెప్పారు. -
2 లక్షల మార్క్‌ను దాటేసిన కాగ్నిజెంట్
సాక్షి, బెంగళూరు : గ్లోబల్ టెక్నాలజీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతదేశంలో ఎక్కువ వైట్ కాలర్ ఉద్యోగాలను కల్పిస్తున్న రెండవ సంస్థగా అవతరించింది. టీసీఎస్ తరువాత 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న రెండవ ఐటి కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. గ్లోబల్‌గా 2.9 లక్షల ఉద్యోగులను కలిగి వుంది. కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాంకుమార్ రామమూర్తిని నియమించిన సందర్భంగా కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. భారతదేశంలోని ఉద్యోగులు, టీంతో లెక్కలేనన్ని పరస్పర చర్చలు, రెండు వారాల పర్యటన అనంతరం రత్నం లాంటి కాగ్నిజెంట్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రశంసలు కురిపించారు. తమ గ్లోబల్ డెలివరీ, సొల్యూషన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఉందన్నారు. భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులైన, నిబద్థత కలిగిన సహోద్యోగులను కలిగి ఉండటం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు. రెండు లక్షలపైగా ఉద్యోగులు ఖాతాదారులకు విలువైన సేవలందించారనీ, పరిశ్రమలోనే అత్యంత విలువైన సేవలు, నూతన ఆవిష్కరణల సామర్థ్యంతో కాగ్నిజెంట్ ఇండియా ఉజ్వల భవిష్యత్తు వెలుగొందుతుందన్నారు. కాగా ఇండియాలో అతి ఎక్కువమంది ఉద్యోగాలను కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్ వుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉద్యోగులుండగా, వీరిలో ఎక్కువమంది భారతీయులే. మరోవైపు ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 40వేల మంది విదేశీయులు. -
ఆ ఉద్యోగులకు లేఆఫ్స్ భయం
బెంగళూర్ : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగాల్లో భారీ కోత విధించనుంది. వ్యయాలను తగ్గించుకునే పనిలో పడ్డ కాగ్నిజెంట్ వందల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకునేందుకు సన్నద్ధమైంది. ఖర్చులకు కత్తెర వేస్తూ వృద్ధికి ఊతమిచ్చేలా కొత్త సీఈఓ బ్రైన్ హంపైర్స్ కంపెనీ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించడంతో ఉద్యోగులపై కత్తి వేలాడుతోంది. వేతన పెంపు విషయంలోనూ కాగ్నిజెంట్ కఠినంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. మెరుగైన సామర్థ్యం కనబరచని, ఏ ప్రాజెక్ట్‌కు అలాట్ కాని సిబ్బందిని వేతన పెంపులో పక్కనపెడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఉద్యోగుల తొలగింపులో ఎనిమిదేళ్ల పైబడిన అనుభవం కలిగిన ఉద్యోగులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో కంపెనీ ఇప్పటికే అత్యవసరం కాని టూర్లను తగ్గించడంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. మరోవైపు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైన ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్లు ఇచ్చినా వారిని విధుల్లోకి తీసుకోవడంలో విపరీత జాప్యం నెలకొంది. బెంచ్‌పై పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఉన్న క్రమంలో నే ఫ్రెషర్స్ ఎంట్రీలో జాప్యం చోటుచేసుకుంటోంది. -
సీనియర్లను ఇంటికి పంపేస్తున్న కాగ్నిజెంట్
అంతర్జాతీయ ప్రముఖ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లను ఇంటికి పంపేస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగాలపై వేటు వేయాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది. సీనియర్లపై వేటు వేయాలని చూస్తున్న ఈ కంపెనీ, ఆ స్థానాల్లో మరింత మంది జూనియర్లకు చోటు కల్పించనున్నట్టు కూడా తెలిపింది. గురువారం ప్రకటించిన కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను కాగ్నిజెంట్ చేరుకోలేకపోయింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలోనే కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేసినట్టు పేర్కొంది. సీనియర్లను కాగ్నిజెంట్ టార్గెట్ చేసిందని, ఇది కేవలం వాలంటరీ మాత్రమే కాదని, ఇది మరింత ఇన్వాలంటరీ(బలవంతం పంపించేయడం) అని కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజ్ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సారి లేఆఫ్‌లో ఎంతమంది సీనియర్ స్థాయి ఉద్యోగులును టార్గెట్ చేశారో ఆయన బహిర్గతం చేయలేదు. ఇది గ్లోబల్ ప్రక్రియ అని, ప్రత్యేక ప్రాంతాన్ని, ప్రత్యేక దేశాన్ని తాము టార్గెట్ చేయలేదని మాత్రం చెప్పారు. కాగ, సీనియర్లపై వేటు వేస్తున్న ఈ కంపెనీ జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటుంది. మరింత మంది జూనియర్లకు తన కంపెనీలో చోటు కల్పిస్తోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటున్న ఈ కంపెనీకి, ఈ క్వార్టర్లో హెడ్‌కౌంట్ కూడా పెరిగింది. రెండో క్వార్టర్లో 7500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. మూడో క్వార్టర్లో జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లాగ్లిన్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్లో ఉంటాయన్నారు. ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టడానికి తమకు మంచి మార్జిన్లు నమోదవడం గుడ్‌న్యూస్ అని మెహతా చెప్పారు. ఈ రెండో క్వార్టర్లో కాగ్నిజెంట్ రెవెన్యూలు 4.01 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది నుంచి ఇవి 9.2 శాతం పెంపు. -
క్యూ2లో కాగ్నిజెంట్‌కు తగ్గిన లాభాలు
సాక్షి, ముంబై: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ క్యూ2 లో నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. జూన్ నెలాఖరుకు ముగిసిన రెండవ త్రైమాసికంలో నికరలాభం 2.97 శాతం తగ్గి 456 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 470 మిలియన్ డాలర్లుగా నమోదయిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆదాయంలో పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 3.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 9.2 శాతం ఎగిసి 4 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మూడో త్రైమాసికంలో సంస్థ 4.06 బిలియన్ డాలర్ల నుంచి 4.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. నికర-ఆపరేటింగ్ విదేశీ మారకం నష్టాలు ,రూపాయి విలువ గత సంవత్సరంతో పోల్చితే తమ లాభాలను దెబ్బతీసిందని కాగ్ని జెంట్ఫలితాల సందర్భంగా వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది ఆదాయంలో మరింత పుంజుకోనుందనే ధీమాను కంపెనీ సీఈవో వెలిబుచ్చారు. -
టెక్ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు
-
టెక్ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు
చెన్నై : టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్, ఐటీ డిపార్ట్మెంట్కు రూ.420 కోట్ల పన్నును వెంటనే కట్టాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో వీటిని చెల్లించాలని పేర్కొంది. రూ.2800 కోట్ల పన్ను ఐటీ డిపార్ట్మెంట్కు కాగ్నిజెంట్ బాకీ పడిందనే ఆరోపణల నేపథ్యంలో, దానిలో 15 శాతం అంటే రూ.420 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఈ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం కంపెనీకి చెందిన ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాను తిరిగి నడిచేలా చేయాలని కోర్టు పేర్కొంది. కాగ్నిజెంట్ సుమారు రూ.2800 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై, ముంబైలలో సంస్థకు చెందిన 64 బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేశారు. అయితే తాము అన్ని పన్నులను చెల్లించినట్టు కాగ్నిజెంట్ చెబుతోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల ప్రొసీడింగ్స్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ... పన్నులోని 15శాతం అంటే దాదాపు రూ.420కోట్లను రెండు రోజుల్లోగా కాగ్నిజెంట్ చెల్లించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాకు సడలింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్బీఐ, డ్యుయిస్, కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ వంటి ఇతర బ్యాంకుల్లోని ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ 2013-16 మధ్యకాలంలో తన మాతృసంస్థకు డివిడెంట్లను పంపిణీ చేసింది. ఈ డివిడెంట్ల పంపిణీ విషయంలో, ఐటీ శాఖకు రూ.2800 కోట్ల మేర డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఐటీ డిపార్ట్మెంట్కు కట్టాల్సి ఉంది. కానీ ఆ పన్ను కాగ్నిజెంట్ కట్టలేదు. దీంతో ఈ కంపెనీకి ఐటీ డిపార్ట్మెంట్ పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కాగ్నిజెంట్ స్పందించలేదు. దీంతో ముంబై, చెన్నైలలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. తమ కంపెనీ బ్యాంకు ఖాతాల నిలుపుదలను ఎత్తేయాలని కోరుతూ కాగ్నిజెంట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. పన్నులో 15 శాతం ఐటీ డిపార్ట్మెంట్కు కట్టాలని ఆదేశించింది. -
కాగ్నిజెంట్‌కు ఐటీ షాక్
సాక్షి, చెన్నై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటిఎస్) ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. పన్నుఎగవేత ఆరోపణలతో వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. 2016-17 సంవత్సరానికి సంబంధించిన రూ.2500కోట్లకు పైగా పన్నులు చెల్లించలేదంటూ ఆదాయ పన్ను శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఆదాయం పన్ను చట్టం ప్రకారం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి) 2,500 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు చెల్లించలేదని సీనియర్ టాక్స్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో చెన్నై, ముంబైలోని బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ గతవారం స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంపై కాగ్నిజెంట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కాగ్నిజెంట్ అధికారి ప్రతినిధి అన్నిబకాయిలను చెల్లించామని వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని ప్రకటించారు. అయితే మరిన్ని వివరాలను అందించడానికి నిరాకరించారు. -
టెకీలకు షాక్ : ఆ కంపెనీలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య
సాక్షి, చెన్నై : దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌లో 2017లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికా, యూరప్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరగ్గా భారత్‌లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2016 సంవత్సరాంతంలో భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య 1,88,000లు కాగా 2017 సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 1,80,000కు పడిపోయింది. ఒక్క ఏడాదిలో 8000 మంది ఉద్యోగులు సంస్థను వీడారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్ ఫలితంగా భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు.మరోవైపు ఇదే కాలంలో కాగ్నిజెంట్ అమెరికా ఉద్యోగుల సంఖ్య 2900 పెరిగి 50,400కు పెరగ్గా, యూరప్ ఉద్యోగుల సంఖ్య 2300 పెరిగింది. భారత్‌లో హైరింగ్ ఊపందుకుంటున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో నియామకాలు పెద్ద ఎత్తున సాగుతుంటే భారత్‌లో కంపెనీలు హైరింగ్‌పై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి వృద్ధికి కేవలం టెక్నాలజీనే కాకుండా మిగతా రంగాలపై దృష్టిసారించాలని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఈ టెకీలకు రోబోల ముప్పు లేదు..
సాక్షి,న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్‌తో ఉద్యోగాలకు ఎసరు వస్తుంటే తాజాగా 21 జాబ్లకు రోబోల నుంచి మరో పదేళ్ల వరకూ ఎలాంటి ముప్పూ ఉండదని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఓ నివేదికలో వెల్లడించింది.పరిశ్రమ ట్రెండ్స్,వాస్తవాలను ఆకళింపు చేసుకుని ఈ నివేదిక రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. రోబో ఫ్రూఫ్ జాబ్‌లుగా ఇవి భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయని తెలిపింది. ఈ సూపర్ జాబ్స్‌లో క్వాంటమ్ మెషీన్ లెర్నింగ్ ఎనలిస్ట్, అగ్మెంటెడ్ రియాల్టీ జర్నీ బిల్డర్,మాస్టర్ ఆఫ్ ఎడ్జ్ కంప్యూటింగ్,జెనెటిక్ డైవర్సిటీ ఆఫీసర్, ఏఐ-అసిస్టెడ్ హెల్త్‌కేర్ టెక్నీషియన్,సైబర్ సిటీ అనలిస్ట్,డేటా డిటెక్టివ్, పర్సనల్ డేటా బ్రోకర్, ఐటీ ఫెసిలిటేటర్,మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్,బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్,డిజిటల్ టైలర్,వర్చువల్ స్టోర్ షెర్పా,ఫిట్నెస్ కమిట్మెంట్ కౌన్సెలర్,పర్సనల్ మెమరీ క్యూరేటర్,చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్,ఫైనాన్షియల్ వెల్నెస్ కోచ్,జీనోమిక్ పోర్ట్‌పోలియో డైరెక్టర్,ఎథికల్ సోర్సింగ్ మేనేజర్,హైవే కంట్రోలర్ వంటి ఉద్యోగాలున్నాయి. -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు క్యాష్ ఆఫర్
చెన్నై : అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు ఓ వినూత్నకర విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ పనితీరు కనబర్చే ఉద్యోగులకు స్టాక్స్ ఆఫన్స్ బదులు నగదును ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి సీనియర్ మేనేజర్లకు, అసోసియేట్ డైరెక్టర్లకు సమాచారం అందించింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ల బదులు ఉద్యోగులు నగదు తీసుకోవాలని కంపెనీ ఆదేశించింది. ఈ ఏడాది మొదట్లోనే ఈ కంపెనీ 3.4 బిలియన్ డాలర్లను వచ్చే రెండేళ్లలో తమ షేర్ హోల్డర్స్‌కు షేర్లు తిరిగి కొనుగోలు, డివిడెండ్ల రూపంలో అందించనున్నట్టు తెలిపింది. 2017 తొలి క్వార్టర్‌లోనే 1.5 బిలియన్ డాలర్లతో షేరును తిరిగి కొనుగోలు చేసే ప్రొగ్రామ్‌ను ప్రారంభించేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఒక్కో షేరుకు 0.15 డాలర్ల డివిడెండ్‌ను ఇస్తోంది. ''ఇది ఒక ఆసక్తికరమైన అభివృద్ధి. ఈక్విటీ మంజూరు, స్టాక్ ఆప్షన్స్ అత్యుత్తమ ఈక్విటీని విలీనం చేస్తాయి. వీటిని నగదుకు మార్చడం ద్వారా వీరు స్టాక్ బైబ్యాక్ సంస్కరణను సాధించగలిగారు" అని ఎవరెస్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెండోర్ శామ్యూల్ తెలిపారు. బైబ్యాక్‌ను ప్రకటించే ముందే కంపెనీ పలువురు సీనియర్ ఉద్యోగులకు వాలంటరీ సెపరేషన్ స్కీమ్‌ను ఆఫర్ చేసింది. అంతేకాక బోర్డులో మార్పులు, ఫైనాన్సియల్ కమిటీ ఏర్పాటు వంటి వాటిని చేపట్టింది. -
అదరగొట్టిన కాగ్నిజెంట్
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో లాభాలు భారీ జంప్ చేశాయి. అలాగే వచ్చే ఏడాదికి 10శాతం గైడెన్స్ అంచనా నిర్ణయించడం విశేషం. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 11 శాతం జంప్ చేసినట్టు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూ3లో కంపెనీ నికరలాభం 11.4 శాతం పెరిగి 495 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది జూలై-సెప్టెంబరు నెలలో 444 మిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఆదాయం 9.1 శాతం పెరిగి 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా దాని గైడెన్స్ రేంజ్ 3.73-3.78 బిలియన్ డాలర్లను అధిగమించింది. అలాగే కంపెనీ నాలుగవ త్రైమాసికానికి 9.5-10శాతం గైడెన్స్‌తో ఆదాయం 3.79-3.85 బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని ఆశిస్తోంది. అలాగే ఒక్కో షేరుకు 0.15 డాలర్ల (రూ.9.69) నగదు డివిడెండ్‌ను ప్రకటించింది. నవంబరు 20వ తేదీని రికార్డు తేదీగా పరిగణించి, నవంబరు 30న ఈ చెల్లింపు చేయనున్నట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది. కాగా ఇండియాలో ఎక్కువమంది ఉద్యోగులున్న కాగ్నిజెంట్ జనవరి-డిసెంబరు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో వ్యాపారాన్ని, కార్యకలాపాలను, సాంకేతిక పరిజ్ఞానం సామర్ధ్యాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేసుకుంటున్నామని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఖాతాదారుల ప్రాధాన్యతల అవగాహన మెరుగైన డిజిటల్ సేవలు నేపథ్యంలో వారితో దీర్ఘ-కాల సంబంధాలు కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
కాగ్నిజంట్ నికర లాభం 15 శాతం వృద్ధి
ముంబై: సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ సంస్థ కాగ్నిజంట్ టెక్నాలజీ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 27.69 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు 31.96 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ మంగళవారం తెలిపింది. ఆదాయం 22 శాతం వృద్ధితో 231 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధి సాధించామని వివరించింది. అవుట్ సోర్సింగ్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులపై కంపెనీలు వ్యయాలను పెంచడం వంటి కారణాల వల్ల తమ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయని కాగ్నిజంట్ ప్రెసిడెంట్ గోర్డన్ కోబర్న్ చెప్పారు. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 75 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో ఈ ఏడాది గెడైన్స్‌ను కంపెనీ పెంచింది. 2012 ఆదాయంతో పోల్చితే 2013 ఆదాయం కనీసం 20 శాతం వృద్ధితో 884 కోట్ల డాలర్లకు పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.