కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (ఫైల్ ఫోటో)
చెన్నై : టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్, ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రూ.420 కోట్ల పన్నును వెంటనే కట్టాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో వీటిని చెల్లించాలని పేర్కొంది. రూ.2800 కోట్ల పన్ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కాగ్నిజెంట్ బాకీ పడిందనే ఆరోపణల నేపథ్యంలో, దానిలో 15 శాతం అంటే రూ.420 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఈ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం కంపెనీకి చెందిన ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాను తిరిగి నడిచేలా చేయాలని కోర్టు పేర్కొంది.
కాగ్నిజెంట్ సుమారు రూ.2800 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై, ముంబైలలో సంస్థకు చెందిన 64 బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేశారు. అయితే తాము అన్ని పన్నులను చెల్లించినట్టు కాగ్నిజెంట్ చెబుతోంది. ప్రస్తుతం ఐటీ అధికారుల ప్రొసీడింగ్స్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ... పన్నులోని 15శాతం అంటే దాదాపు రూ.420కోట్లను రెండు రోజుల్లోగా కాగ్నిజెంట్ చెల్లించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. ముంబైలోని జేపీ మోర్గాన్ బ్యాంకు ఖాతాకు సడలింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్‌బీఐ, డ్యుయిస్, కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఇతర బ్యాంకుల్లోని ఖాతాలు అలాగే స్తంభింపజేసి ఉంటాయని తెలిపారు.
కాగ్నిజెంట్ కంపెనీ 2013-16 మధ్యకాలంలో తన మాతృసంస్థకు డివిడెంట్లను పంపిణీ చేసింది. ఈ డివిడెంట్ల పంపిణీ విషయంలో, ఐటీ శాఖకు రూ.2800 కోట్ల మేర డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కట్టాల్సి ఉంది. కానీ ఆ పన్ను కాగ్నిజెంట్ కట్టలేదు. దీంతో ఈ కంపెనీకి ఐటీ డిపార్ట్‌మెంట్ పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కాగ్నిజెంట్ స్పందించలేదు. దీంతో ముంబై, చెన్నైలలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. తమ కంపెనీ బ్యాంకు ఖాతాల నిలుపుదలను ఎత్తేయాలని కోరుతూ కాగ్నిజెంట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. పన్నులో 15 శాతం ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కట్టాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment