సాక్షి, బెంగళూరు : గ్లోబల్ టెక్నాలజీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతదేశంలో ఎక్కువ వైట్ కాలర్ ఉద్యోగాలను కల్పిస్తున్న రెండవ సంస్థగా అవతరించింది. టీసీఎస్ తరువాత 2 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న రెండవ ఐటి కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. గ్లోబల్‌గా 2.9 లక్షల ఉద్యోగులను కలిగి వుంది.
కాగ్నిజెంట్ ఇండియా సీఎండీగా రాంకుమార్ రామమూర్తిని నియమించిన సందర్భంగా కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. భారతదేశంలోని ఉద్యోగులు, టీంతో లెక్కలేనన్ని పరస్పర చర్చలు, రెండు వారాల పర్యటన అనంతరం రత్నం లాంటి కాగ్నిజెంట్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రశంసలు కురిపించారు. తమ గ్లోబల్ డెలివరీ, సొల్యూషన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఉందన్నారు. భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులైన, నిబద్థత కలిగిన సహోద్యోగులను కలిగి ఉండటం తమ అదృష్టమని వ్యాఖ్యానించారు. రెండు లక్షలపైగా ఉద్యోగులు ఖాతాదారులకు విలువైన సేవలందించారనీ, పరిశ్రమలోనే అత్యంత విలువైన సేవలు, నూతన ఆవిష్కరణల సామర్థ్యంతో కాగ్నిజెంట్ ఇండియా ఉజ్వల భవిష్యత్తు వెలుగొందుతుందన్నారు.
కాగా ఇండియాలో అతి ఎక్కువమంది ఉద్యోగాలను కల్పిస్తున్న సంస్థగా టీసీఎస్ వుంది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉద్యోగులుండగా, వీరిలో ఎక్కువమంది భారతీయులే. మరోవైపు ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 40వేల మంది విదేశీయులు.
Comments
Please login to add a commentAdd a comment