సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో లాభాలు భారీ జంప్ చేశాయి. అలాగే వచ్చే ఏడాదికి 10శాతం గైడెన్స్ అంచనా నిర్ణయించడం విశేషం. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 11 శాతం జంప్ చేసినట్టు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
క్యూ3లో కంపెనీ నికరలాభం 11.4 శాతం పెరిగి 495 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది జూలై-సెప్టెంబరు నెలలో 444 మిలియన్ డాలర్ల నికర లాభం సాధించింది. ఆదాయం 9.1 శాతం పెరిగి 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా దాని గైడెన్స్ రేంజ్ 3.73-3.78 బిలియన్ డాలర‍్లను అధిగమించింది. అలాగే కంపెనీ నాలుగవ త్రైమాసికానికి 9.5-10శాతం గైడెన్స్‌తో ఆదాయం 3.79-3.85 బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని ఆశిస్తోంది. అలాగే ఒక్కో షేరుకు 0.15 డాలర్ల (రూ.9.69) నగదు డివిడెండ్‌ను ప్రకటించింది. నవంబరు 20వ తేదీని రికార్డు తేదీగా పరిగణించి, నవంబరు 30న ఈ చెల్లింపు చేయనున్నట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది.
కాగా ఇండియాలో ఎక్కువమంది ఉద్యోగులున్న కాగ్నిజెంట్ జనవరి-డిసెంబరు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో వ్యాపారాన్ని, కార్యకలాపాలను, సాంకేతిక పరిజ్ఞానం సామర్ధ్యాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేసుకుంటున్నామని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఖాతాదారుల ప్రాధాన్యతల అవగాహన మెరుగైన డిజిటల్ సేవలు నేపథ్యంలో వారితో దీర్ఘ-కాల సంబంధాలు కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment