భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్
భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్
Published Wed, May 24 2017 3:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
చెన్నై : అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమయ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలను ఎప్పడికప్పుడూ అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్ లో కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేంతవరకు గ్రీన్ కార్డు ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడం లేదని పేర్కొంది.
అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్సర్ గా కాగ్నిజెంట్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని మరోవైపు నుంచి కంపెనీ చెబుతోంది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది. అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లోనే కాగ్నిజెంట్ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు పేర్కొంది. గతేడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలివరీ సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది.
Advertisement