ఈ-కామర్స్ కంపెనీలపై సుప్రీంకెళ్తాం..
న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ విక్రయ(ఈ-కామర్స్) కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడిచేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. సుప్రీం కోర్టు, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)లను ఆశ్రయిస్తామని ట్రేడర్లు గురువారం హెచ్చరించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు ఇష్టానుసారం డిస్కౌంట్లను ఇస్తున్నాయని.. అనుచిత వ్యాపార విధానాలతో సాంప్రదాయ రిటైల్ వ్యాపారులను దెబ్బతీస్తున్నాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) పేర్కొంది.
తమ ఫిర్యాదులు, ఆందోళనలపై ప్రభుత్వం గనుక చర్యలు తీసుకోనిపక్షంలో సుప్రీం, సీసీఐలలో తేల్చుకుంటామని సీఏఐటీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. ఇప్పటికే తాము వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఆన్‌లైన్ వ్యాపార పర్యవేక్షణ, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ వ్యాపార రంగాలు రెండింటినీ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా తాము ఈ సందర్భంగా కోరినట్లు ఖండేల్వాల్ వెల్లడించారు.
గుత్తాధిపత్యానికి దారితీస్తుంది...
ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయడం.. దీనిపై దేశవ్యాప్తంగా ట్రేడర్ల నుంచి తీవ్ర ఆందోళనలు, ఫిర్యాదులు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇతర ఈ-కామర్స్ కంపెనీలు కూడా ఫ్లిప్‌కార్ట్ రూట్‌లోనే నడుస్తుండటంతో సీఏఐటీ తమ స్వరాన్ని మరింత పెంచింది. కాగా, తమ ఫిర్యాదులను సీరియస్‌గా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్ హామీనిచ్చారని ఖండేల్వాల్ చెప్పారు. ఈ నెలాఖరుదాకా వేచిచూస్తామని.. అప్పటికీ మా ఆందోళనలపై ప్రభుత్వం నుంచి చర్యలు లేకపోతే సుప్రీం, సీసీఐలను ఆశ్రయిస్తామన్నారు.
ఒక సంస్థ రూ. 18,000 విలువైన వస్తువును కొద్ది రోజులపాటు రూ.6 వేలకు ఇవ్వడం.. మళ్లీ రేటును రూ.18 వేలకు పెంచేయడంలోని ఔచిత్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి కొనసాగితే ఆఫ్‌లైన్ మార్కెట్లో సదరు ఉత్పత్తుల లభ్యత లేకుండా పోతుందన్నారు. అంతిమంగా మొత్తం మార్కెట్ ఈ-కామర్స్ రిటైలర్ల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఖండేల్వాల్ పేర్కొన్నారు. చిన్నా, పెద్దా అన్ని ఆన్‌లైన్ కంపెనీలూ ఇదే పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ-కామర్స్ కంపెనీల వ్యాపార విధానాలపై దర్యాప్తు జరపాలని.. వాళ్ల పన్ను చెల్లింపులపైనా దృష్టిసారించాల్సిందిగా సీఏఐటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.