సాఫ్ట్ బ్యాంక్‌తో స్నాప్ ‘డీల్’
రూ. 3,760 కోట్ల పెట్టుబడులు
స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు వాటా
న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఒకే ఇన్వెస్టర్ నుంచి అతిపెద్ద పెట్టుబడిని సాధించింది. ఈ కంపెనీలో జపాన్‌కు చెందిన టెలికం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 62.7 కోట్ల డాలర్లను(సుమారు రూ. 3,760 కోట్లు) ఇన్వెస్ట్‌చేసింది. దేశీ ఈకామర్స్ రంగంలో ఒకే ఇన్వెస్టర్ చేసిన అత్యధిక పెట్టుబడి ఇది. ఈ సందర్భంగా స్నాప్‌డీల్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా అవతరించినట్లు పేర్కొన్న సాఫ్ట్‌బ్యాంక్ ఎంతవాటాను సొంతం చేసుకున్నదీ వెల్లడించలేదు. స్నాప్‌డీల్ వివిధ ఇన్వెస్టర్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటికే బిలియన్ డాలర్లను(రూ. 6,000 కోట్లు) సమీకరించిన విషయం విదితమే. పెట్టుబడి చేసిన వారిలో రతన్ టాటా కూడా ఉన్నారు. 2.5 కోట్ల వినియోగదారులతో దేశీయ ఈకామర్స్ మార్కెట్లో స్నాప్‌డీల్ మూడో స్థానంలో ఉంది.
ఇండియన్ అలీబాబా....
భారత ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాలాగా వృద్ధి సాధించనున్నదని సాఫ్ట్‌బ్యాంక్ అంచనా వేస్తోంది. స్నాప్‌డీల్ భారత దేశపు లలీబాబా అయ్యే అవకాశాలున్నాయని సాఫ్ట్‌బ్యాంక్ అధినేత మసయోషి సన్ భావిస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ అలీబాబాలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఆలీబాబాలో మూడో వంతు పెట్టుబడులు ఈ కంపెనీవే. అలీబాబా అమెరికా స్టాక్ ఎక్స్ఛేం జీల్లో లిస్టయిన సందర్భంగా ఈ పెట్టుబడులపై సాఫ్ట్‌బ్యాంక్ భారీ లాభాలను ఆర్జించింది. ఇప్పడు స్నాప్‌డీల్ పెట్టుబడులపై ఇదే స్థాయి రాబడులు వస్తాయని సాఫ్ట్‌బ్యాంక్ ఆశిస్తోంది. స్నాప్‌డీల్‌లో ఏకైక అతి పెద్ద సింగిల్ ఇన్వెస్టర్ ఈ కంపెనీయే.
ఒప్పందం థ్రిల్లింగ్: కునాల్ బెహల్
సాఫ్ట్‌బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ చెప్పారు. అమెరికా ఇంజనీరింగ్, బిజినెస్ డిగ్రీలున్న కునాల్ బెహల్ మైక్రోసాఫ్ట్‌లో కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. అయితే వీసా సమస్యల కారణంగా ఆయన అమెరికాను వీడాల్సి వచ్చింది. భారత్‌కు తిరిగివచ్చిన బెహల్ తన చిన్ననాటి మిత్రుడు ఐఐటీ పట్టభద్రుడు బన్సాల్‌తో జట్టు కట్టాడు. రిటైల్‌తో సహా వివిధ వ్యాపారాలను వీరిరువురు నిర్వహించారు.
ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. చైనా వెళ్లిన వారికి అలీబాబా రూపంలో అదృష్టం సాక్షాత్కరించింది. చైనాలో లాగానే భారత్‌లో కూడా వినియోగదారుల సంఖ్య భారీగా ఉందని, రిటైల్ సంస్థల విస్తరణకు రియల్టీ ధరలు అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించిన వారిరువురు చైనా ఆలీబాబా స్ఫూర్తితో భారత్‌లో ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కామర్స్ మార్కెట్లో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని బెహల్ చెప్పారు. తాము ఇప్పడే ప్రయాణం ప్రారంభించామని, సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. అలీబాబా గత ఏడాది 24,800 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. వచ్చే ఏడాది కల్లా వంద కోట్ల డాలర్ల విక్రయాలు సాధించాలని స్నాప్‌డీల్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా మొత్తం భారత రిటైల్ రంగంలో ఈ కామర్స్ వాటా 0.8 శాతంగానే ఉంది. అమెరికాలో ఇది 7 శాతంగానూ, చైనాలో 10 శాతంగానూ ఉంది.
ఓలా క్యాబ్స్లోనూ....
స్నాప్‌డీల్‌లో ఒక్క సాఫ్ట్‌బ్యాంక్ మాత్రమే పెట్టుబడి చేయగా, ఇదే కంపెనీ ఇతర సంస్థలతో కలసి ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలా(గతంలో ఓలా క్యాబ్స్)లోనూ 21 కోట్ల డాలర్లను(రూ. 1,260 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. రానున్న కాలంలో ఇండియాలో 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) ఇన్వెస్ట్‌చేయనున్నట్లు ముందురోజు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పెట్టుబడుల వివరాలను ప్రకటించింది. సాఫ్ట్బ్యాంక్సహా కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్ 21 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఓలా తెలిపింది.
ఇంటర్నెట్ వినియోగదారులకు ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నదని, అయితే ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ అంతగా విస్తరించలేదని సాఫ్ట్‌బ్యాంక్ కార్ప్ వైస్‌చైర్మన్ నికేష్ అరోరా వ్యాఖ్యానించారు. వెరసి చౌకైన వేగవంతమైన ఇంటర్నెట్ను అందించాల్సి ఉన్నదని చెప్పారు. వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా అరోరాకు స్నాప్‌డీల్ బోర్డులో చోటు లభించనుంది.