కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేసిన లీ ఫార్మా
- మధుమేహ ఔషధం తయారీకి రెడీ
- అతి తక్కువ ధరకే అందించేందుకు సిద్ధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ ఫార్మా మధుమేహ చికిత్సలో వాడే సాక్సాగ్లిప్టిన్ ఔషధం తయారీకై కంపల్సరీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసింది. పేటెంటెడ్ డ్రగ్ అయిన సాక్సాగ్లిప్టిన్‌ను ఆన్‌గ్లైజా బ్రాండ్ పేరుతో, అలాగే మెట్‌ఫార్మిన్ కాంబినేషన్‌తో కాంబిగ్లైజ్ బ్రాండ్‌తో ఆస్ట్రాజెనికా భారత్‌లో మార్కెట్ చేస్తోంది. వాలంటరీ లెసైన్సు కోసం ఆస్ట్రాజెనికాతో గత ఎనిమిది నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు లీ ఫార్మా ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పేటెంటు యాక్టు సెక్షన్ 84 ప్రకారం కంపల్సరీ లెసైన్సు కావాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి.
ఇక సాక్సాగ్లిప్టిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని, ఇన్సులిన్ వాడే అవసరం లేదని కంపెనీ వర్గాలు అంటున్నాయి. లీ ఫార్మాతో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో కంపల్సరీ లెసైన్సుకు చేసుకున్న దరఖాస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. బేయర్ తయారీ క్యాన్సర్ ఔషధమైన నెక్సావర్ జనరిక్ వర్షన్ కోసం నాట్కో చేసుకున్న దరఖాస్తు మొదటిది కాగా, బ్రిస్టల్ మేయర్ స్క్విబ్ తయారీ క్యాన్సర్ మందు డసాటినిబ్ జనరిక్‌కై బీడీఆర్ కంపెనీ దరఖాస్తు రెండోది. నాట్కోకు మాత్రమే కంపల్సరీ లెసైన్సు దక్కింది.
అతి తక్కువ ధరలో..ఇక ఆన్‌గ్లైజాకు జనరిక్ వర్షన్ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతి కోరుతూ జూన్ చివరి వారంలో లీ ఫార్మా దరఖాస్తు చేసింది. సరిపడ లభ్యత లేకపోయినా, అందుబాటు ధరలో లభించని పరిస్థితుల్లో ఔషధానికి పేటెంటు వచ్చిన మూడేళ్ల తర్వాత కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. ఆస్ట్రాజెనికా భారత్‌లో ఆన్‌గ్లైజా ట్యాబ్లెట్‌ను రూ.41-45 మధ్య, కాంబిగ్లైజ్‌ను రూ.49కి విక్రయిస్తోంది. వాస్తవానికి దిగుమతి అయిన ఒక్కో ట్యాబ్లెట్‌కు కంపెనీకి అయిన వ్యయం 80-92 పైసలు మాత్రమే.
పేషెంటుకు నెలకు అయ్యే ఖర్చు సుమారు రూ.1,300. ఇది రోగులకు భారమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సాక్సాగ్లిప్టిన్ 2.5 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.27, 5 ఎంజీ ట్యాబ్లెట్‌ను రూ.29లకే అందించాలని లీ ఫార్మా నిర్ణయించింది. అలాగే సాక్సాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్‌ను దాని సామర్థ్యాన్నిబట్టి రూ.30-31.50లకే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రాజెనికాకు చెల్లించాల్సిన రాయల్టీతో కలుపుకుని ఈ ధరలను నిర్ణయించింది.