దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి రెట్టింపు స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) ప్రెసిడెంట్, టోరెంట్ గ్రూప్ ఛైర్మన్ సమీహ్ మెహతా తెలిపారు. అప్పటికి 120–130 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,79,400 కోట్లు)కు చేరుకోవచ్చని, 2047 నాటికి 400–450 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకోగలదని ఆయన పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో భారతీయ ఫార్మా(Pharma) పరిశ్రమ 20 రెట్లు పెరిగిందని వివరించారు.
1999–2000లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్నది 58 బిలియన్ డాలర్లకు చేరిందని మెహతా చెప్పారు. వాణిజ్య మిగులుకు దోహదపడుతున్న అయిదు రంగాల్లో ఇది కూడా ఒకటని ఐపీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాసిన ఆర్టికల్‌లో ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఉద్యోగాల కల్పన నుండి గ్లోబల్ ట్రేడ్(Global Trade) వరకు వివిధ అంశాల్లో ఫార్మా కీలక పాత్ర పోషించగలదని ఆయన వివరించారు. సానుకూల పాలసీలు, పరిశోధనలు.. అభివృద్ధిపై భారీ పెట్టుబడులు, చౌకగా వైద్యసేవలను అందుబాటులోకి తేవడం మొదలైనవన్నీ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు పని చేసేందుకు దోహదపడతాయని మెహతా తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలకు నెలకొన్న డిమాండ్‌లో భారత్ 20 శాతం ఔషధాలను సరఫరా చేస్తోందని, పరిమాణం.. విలువపరంగా 11వ ర్యాంకులో ఉందని వివరించారు.
ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!
నష్టాల్లోకి మొబిక్విక్
డిజిటల్ వాలెట్ సేవలందించే మొబిక్విక్(Mobikwik) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ.3.6 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.6 కోట్ల స్టాండెలోన్ నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ.207 కోట్ల నుంచి రూ.297 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.186 కోట్ల నుంచి రూ.287 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.7 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గత నెల లో లిస్టయిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. తదుపరి వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో నష్టాలు నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment