రాయితీలు లాభమేనా?
సాక్షి, హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలోని నిర్మాణ సంస్థలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి, ఈ ఆఫర్లు నిజంగా స్థిరాస్తి కొనుగోలుదారులకు లాభసాటేనా? అసలు ప్రాజెక్ట్ కొనగానే సాఫ్ట్ లాంచ్‌లోనో.. ప్రీ లాంచ్‌లోనో కొంటే లాభముంటుందా? వంటి సందేహాలు సహజం.
♦ ప్రాజెక్ట్ ప్రారంభించగానే కొనుగోలు చేస్తే కొంత వరకు లాభముంటుందని నిపుణులంటున్నారు. ఎలాగంటే ఓ కంపెనీ ధర చ.అ.కు రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ పేరిట అమ్మకాలు చేపట్టినప్పుడు చ.అ.కు రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
♦ ప్రాజెక్ట్ లేదా వెంచర్ ఏదైనా సరే మీరు మొదటి కస్టమరైతే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తారు. ఫ్లాట్‌లోని ప్రత్యేకతలు, వసతులూ నచ్చకపోతే మార్పులు చేయమంటే కూడా చేసిస్తారు. అంటే మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి.
♦ అయితే ధర తక్కువగా ఉందని తొందరపడి మాత్రం స్థిరాస్తిని కొనుగోలు చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోవాలి. అలాగే కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్‌కు అనుమతి ఉందా? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా? మళ్లీ అమ్మకానికి పెడితే రీసేల్ అవుతుందా? వంటి అంశాల్ని గమనించాలి.
సంస్థలకూ లాభమే..
ముందస్తు కొనుగోళ్లు కస్టమర్లకే కాదు నిర్మాణ సంస్థలకూ లాభమే. అనుమతులు రాక ముందే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముందస్తు అమ్మకాలు కలిసొస్తాయి. అయితే ఇది కేవలం నిర్మాణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపైనే ఆధారపడుతుంది సుమి.