మార్కెట్లోకి కూల్ప్యాడ్ మ్యాక్స్ స్మార్ట్ఫోన్
ధర రూ.24,999
న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ శుక్రవారం కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కూల్‌ప్యాడ్ మ్యాక్స్ పేరుతో అందిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.24,999 అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. ఈ ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్‌లకు ఒక్కో దానికి రెండు అకౌంట్‌లు నిర్వహించుకునే ప్రత్యేకమైన ఫీచర్ ఉందని కూల్‌ప్యాడ్ ఇండియా సీఈఓ సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు. 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌ను 1.5 గిగాహెర్ట్స్ ఆక్టకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమెరీ, 64 జీబీకు విస్తరించుకోగలిగే మెమెరీ, ఫోన్ వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.
ఈ కంపెనీ భారత్‌లో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని తాజుద్దీన్ పేర్కొన్నారు. భారత వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా లోకల్ ఫీచర్లను తమ ఫోన్లలో జత చేయడానికి ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. స్మార్ట్‌ఫోన్ల్ సంబంధిత యాప్, కంటెంట్ డెవలప్‌మెంట్‌లపై కూడా ఈ సెంటర్ దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో మొబైల్ ఫోన్లను అసెంబుల్ చేయడానికి వీడియోకాన్ కంపెనీతో ఈ కూల్‌ప్యాడ్ కంపెనీకి భాగస్వామ్యం ఉంది.