కార్పొరేట్‌ బ్రీఫ్స్‌ | Corporate Briefs | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ బ్రీఫ్స్‌

Published Tue, Sep 4 2018 1:40 AM | Last Updated on Tue, Sep 4 2018 1:40 AM

Corporate Briefs - Sakshi

నిర్మాణ, ఇంజనీరింగ్‌ కంపెనీ నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌కు (ఎన్‌సీసీ) ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీల నుంచి రూ.3,592 కోట్ల విలువ చేసే నాలుగు ఆర్డర్లు దక్కాయి. ఇందులో రూ.671 కోట్ల రెండు బిల్డింగ్‌ డివిజిన్‌ ఆర్డర్లు, రూ.2,850 కోట్ల రోడ్స్‌ డివిజన్‌ ఆర్డర్, రూ.70.9 కోట్ల వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డివిజన్‌ ఆర్డర్‌ ఉన్నాయని కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఇప్పటివరకు రూ.7,898 కోట్ల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది.

జీఎస్‌టీ ప్రకటనల వ్యయం రూ.132 కోట్లు
వస్తు సేవల పన్ను చట్టంపై అందరికీ అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.132.38 కోట్లు ఖర్చుచేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. పత్రికా ప్రకటనల కోసం రూ.127 కోట్ల వ్యయం చేయగా.. అవుట్‌డోర్‌ మీడియా నిమిత్తం రూ.5.4 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.  కాగా వ్యాట్, సర్వీస్‌ ట్యాక్స్‌ పరిధిలోని 1,800 వ్యాపారులు స్వచ్ఛందంగా జీఎస్‌టీలోకి మారేందుకు ముందుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ జూలైలో ప్రకటించిన నూతన మైగ్రేషన్‌ విండోను సద్వినియోగం చేసుకునేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 1.15 కోట్ల వ్యాపారులు జీఎస్‌టీ పరిధిలో ఉండగా వీరిలో 63.76 లక్షలు వలసలుగానూ, 51 లక్షల నూతన రిజిస్ట్రేషన్లుగా ఉన్నట్లు వివరించింది.

ప్లాంట్‌ సామర్థ్యం పెంపు దిశగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
కర్ణాటకలోని విజయనగర్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.8 కోట్ల టన్నులకు (ఏడాదికి) పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఎండీ సజ్జన్‌ జిందాల్‌ వెల్లడించారు. ఇందుకోసం 2020 నాటికి రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్లాంట్‌ సామర్థ్యం 1.3 కోట్ల టన్నులుగా ఉంది.  

సిగ్నా టీటీకేలో మణిపాల్‌ వాటా కొనుగోలు
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణలోని మణిపాల్‌ గ్రూప్‌.. సిగ్నా టీటీకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 16.04 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ అనంతరం ఆరోగ్య బీమా కంపెనీలో టీటీకే గ్రూప్‌ వాటా 34.96 శాతంగా నిలువనుంది. ఇరు సంస్థలు కలిసి 51 శాతం వాటాను కలిగి ఉంటాయి. మిగిలిన 49 శాతం వాటా సిగ్నా కార్పొరేషన్‌ చేతిలో ఉంటుంది.

ఎన్‌హెచ్‌ఏఐపై రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు ఆర్బిట్రేషన్‌ అవార్డు
నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రూ.200 కోట్ల మధ్యవర్తిత్వ అవార్డును పొందింది. ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఆగస్టు 31న ఏకగ్రీవంగా అవార్డును ఇచ్చినట్లు వెల్లడించింది. నవంబరు 29 నాటికి రూ.150 కోట్లు చెల్లించాలని, లేని పక్షంలో 12 శాతం వడ్డీ ఉంటుందని తెలిపింది.

జోరుగా ఎన్‌సీడీల జారీ
ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసిక కాలంలో దేశీ కంపెనీలు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను (ఎన్‌సీడీ) జారీ చేయడం ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించి ఏకంగా 5 రెట్లు పెరుగుదలను నమోదుచేశాయి. కొసమట్టం ఫైనాన్స్, ముత్తూట్‌ ఫైనాన్స్, జేఎం ఫైనాన్షియల్, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్, ఈసీఎల్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఈ కాలంలో ఎన్‌సీడీలను జారీ చేశాయి.

నేడు ఎల్‌ఐసీ బోర్డ్‌ సమావేశం
ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను చేజిక్కించుకునే ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీ బోర్డ్‌ మంగళవారం సమావేశంకానుంది. ఈమేరకు వాటా పెంపు నిమిత్తం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో విధివిధానాలకు సంబంధించి బోర్డ్‌ చర్చించనున్నట్లు సమాచారం. ఎల్‌ఐసీకి ఇప్పటికే బ్యాంకులో 7.98 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే.

డీఎల్‌ఎఫ్‌ రూ.1,400 కోట్ల పెట్టుబడులు
గురుగ్రామ్‌లోని 12 ఎకరాల వాణిజ్య ప్రాజెక్టు అభివృద్ధికై రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ రూ.1,400 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. సైబర్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ నిమిత్తం ఇంతకుముందు రూ.412.67 కోట్లు అంచనావేసిన ఈ సంస్థకు.. ఫ్లోర్‌ ఏరియా పెంపునకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పెట్టుబడి పెంచింది.

రక్తపోటు మందుల రీకాల్‌!
అధిక రక్తపోటు అదుపునకు ఉపయోగించే వాల్సార్టన్‌ ట్యాబ్లెట్లతో కూడిన 46,000 బాటిళ్లను స్వయంగా వెనక్కు తీసుకుంటున్నట్లు జుబిలెంట్‌ కాడిస్టా ఫార్మా ప్రకటించింది. అమెరికా మార్కెట్‌ కోసం జుబిలెంట్‌ జనరిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేసిన బాటిళ్లను రీకాల్‌చేసినట్లు తెలిపింది. యాక్టీవ్‌ ఇన్‌గ్రీడియంట్‌తో వాడే మిశ్రమంలో పొరపాటు జరిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఎల్‌ అండ్‌ టీకి రూ.2,654 కోట్ల కాంట్రాక్టు
మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌ఆర్‌డీసీ) నుంచి రూ.2,654 కోట్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. ఇందులో రూ.2,095 కోట్ల నాగపూర్‌ ముంబై సూపర్‌ కమ్యూనికేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఆరు లేన్ల నిర్మాణం కోసం తమ రవాణా విభాగం.. రూ.559 కోట్లతో థానే క్రీక్‌ బ్రిడ్జ్‌ నిమిత్తం సివిల్‌ ఇన్‌ఫ్రా విభాగం కాంట్రాక్టులను సొంతం చేసుకున్నట్లు తెలిపింది.  

గెయిల్‌ బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు
‘ఫ్యూచర్‌ రెడీ’ పేరుతో ఎలక్ట్రానిక్‌ వాహనాలలోని బ్యాటరీల చార్జింగ్‌ సేషన్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు గెయిల్‌ వెల్లడించింది. సీఎన్‌జీ స్టేషన్లలో ఈ ఏర్పాట్లను చేయనున్నట్లు వివరించింది. భవిష్యత్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటును విస్తృతం చేస్తున్నట్లు తెలిపింది.

రిటైల్‌ స్టేషన్ల విస్తరణలో ‘షెల్‌’
వచ్చే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,200 రిటైల్‌ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు షెల్‌ కంపెనీ చైర్మన్‌ నితిన్‌ ప్రసాద్‌ వెల్లడించారు. నూతన స్టేషన్లలో ఎలక్ట్రానిక్, బయోఫ్యూయెల్‌ ఎల్‌ఎన్‌జీ లభ్యంకానున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క స్టేషన్‌ సునాయాసంగా 100 మందికి ఉద్యోగాలను ఇవ్వనుందన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి 120 రిటైల్‌ స్టేషన్లు ఉండగా.. మరో 150 స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఎన్‌సీడీ జారీ చేసిన వొడాఫోన్‌ ఐడియా
కంపెనీ స్థాపన తరువాత తొలిసారిగా వొడాఫోన్‌ ఐడియా లిమిడెట్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను (ఎన్‌సీడీ) జారీచేసింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీలను
జారీ చేయడం ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించింది. 5 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఈ ఎన్‌సీడీలపై ఏడాదికి 10.9 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement