ఫాస్ట్‌ట్రాక్‌లో సంస్కరణలు..
బీమా, బొగ్గు ఆర్డినెన్స్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
* మెడికల్ పరికరాల రంగంలో 100% ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్ రూట్
* బీమా ఎఫ్‌డీఐల పరిమితి 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు
* బొగ్గు బ్లాకుల వేలానికి మార్గం సుగమం
న్యూఢిల్లీ: ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంస్కరణల విషయంలో వెనక్కితగ్గేదిలేదని మోదీ సర్కారు నిరూపించింది. కీలకమైన బీమా, బొగ్గు రంగాల బిల్లులకు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా ఆమోదం లభించకపోవడంతో... ఆర్డినెన్స్‌లు జారీ చేసి వీటిని అమల్లోపెట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బుధవారం ఈ రెండు ఆర్డినెన్స్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు ఫార్మా రంగానికి సంబంధించి మెడికల్ పరికరాల తయారీ విభాగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతించేందుకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆటోమేటిక్ రూట్ అంటే.. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతి లేకుండానే నేరుగా విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది. ఒక విదేశీ సంస్థ భారత్‌లోని ఏదైనా ఈ రంగానికి చెందిన కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయడం.. లేదంటే కొత్తగా తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు వీలవుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో కీలక బిల్లుల ఆమోదం కోసం వేచిచూడకుండా మోదీ సర్కారు శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం విశేషం.
బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బీమా చట్టాల సవరణ బిల్లు-2008 రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు విపక్షాల అందోళనలు గండికొట్టడం తెలి సిందే. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్(ఎఫ్‌పీఐ), ఎఫ్‌డీఐలతో కలిపి కాంపొజిట్ పరిమితి 49 శాతానికి మించకూడదన్న కాంగ్రెస్ సూచనలను సెలక్ట్ కమిటీ ఆమోదించడంతో ఈ బిల్లుకు లైన్ క్లియర్ అయింది. రాజ్యసభలో మోదీ సర్కారుకు మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అయితే, మతమార్పిడులు ఇతరత్రా అంశాలపై విపక్షాలు సభను స్తంభింపజేయడంతో బిల్లును సభ ప్రవేశపెట్టలేదు.
మరోపక్క, బొగ్గు స్కామ్‌లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రద్దయిన 204 బొగ్గు క్షేత్రాలను తిరిగి వేలం వేయడానికి ప్రభుత్వం ఇదివరకే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీన్ని చట్టరూపంలో మార్చేందుకు వీలుగా బొగ్గు గనుల(ప్రత్యేక మార్గదర్శకాల) బిల్లు-2014ను లోక్‌సభలో ఆమోదింపజేయడంలో మోదీ సర్కారు సఫలీకృతమైంది. అయితే, రాజ్య సభలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఈ బిల్లు కూడా ఆమోదానికి నోచుకోలేదు. దీంతో సంబంధిత ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయాలని కేబినెన్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కేటాయింపుల మార్గదర్శకాలకు కూడా ఆమోదముద్ర వేసింది. కాగా, ఈ రెండు ఆర్డినెన్స్‌లకు నిర్దేశిత గడువులోగా సంబంధిత బిల్లులకు పార్లమెంటులో ఆమోదముద్ర పడాలి.
నేటి నుంచి బొగ్గు గనుల వేలం ప్రక్రియ షురూ...
బొగ్గు ఆర్డినెన్స్‌ను పొడిగించడంతో పాటు వేలం విధివిధానాలకు కేబినెట్ ఆమోదం లభించడంతో ప్రైవేటు కంపెనీలకు(సొంత అవసరాల కోసం) ఈ-వేలం ద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపు, ప్రభుత్వ రంగ కంపెనీలకు నేరుగా గనులను కేటాయించేందుకు మార్గం సుగమం అయింది. తొలి విడతలో 24 బొగ్గు గనుల ఈ-వేలానికి సంబంధించిన ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. భారీగా బొగ్గునిల్వలున్న రాష్ట్రాలకు బొగ్గు గనుల పునఃకేటాయింపుల కారణంగా వచ్చే 30 ఏళ్లలో రాయల్టీ, వేలం నిధుల రూపంలో దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ పేర్కొన్నారు.
సుప్రీం రద్దు చేసిన 204 బొగ్గు బ్లాకుల్లో ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న గనులకు వేలం ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తి చేయనున్నామని.. మిగతావాటికి మూడో విడతలో కేటాయింపులు చేస్తామని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
మా చిత్తశుద్ధికి నిదర్శనమిది: జైట్లీ
కీలకమైన బీమా ఎఫ్‌డీఐలు, బొగ్గు గనుల కేటాయింపు బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్‌లను తీసుకురావడం సంస్కరణలపై తమ ప్రభుత్వ నిబద్ధత, చిత్తశుద్ధికి తార్కాణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. కేవలం పార్లమెంటులోని ఒక సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు మార్గం లేకుండా పోయినంతమాత్రాన సంస్కరణల విషయంలో దేశం వేచిచూసే ధోరణిని అనుసరించబోదని ప్రపంచానికి, ముఖ్యంగా ఇన్వెస్టర్లకు స్పష్టమైన సందేశం పంపించామని కూడా జైట్లీ పేర్కొన్నారు.
కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల దేశంలోకి 6-8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.50 వేల కోట్లకుపైగా) విదేశీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, వచ్చే సమావేశాల్లో కూడా బీమా బిల్లును రాజ్య సభలో అడ్డుకుంటే.. పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని(లోక్ సభ, రాజ్యసభ) ఏర్పాటు చేస్తామని జైట్లీ సంకేతాలివ్వడం గమనార్హం.