శాన్‌ఫ్రాన్సిస్కో/క్యూపర్టినో: కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం ఆపిల్ కంపెనీపై పడింది. ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయ అంచనాలను అందుకోలేమని ఐఫోన్స్ తయారు చేసే యాపిల్ కంపెనీ సోమవారం వెల్లడించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో ఐఫోన్‌ల తయారీ దెబ్బతిన్నదని, ఫలితంగా తగిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లను సరఫరా చేయలేమని తెలిపింది. అంతేకాకుండా చైనాలో యాపిల్ స్టోర్స్‌ను కొన్ని రోజులు మూసేశామని, అమ్మకాలు, డిమాండ్ కూడా తగ్గాయని వివరించింది. స్టోర్స్ కొన్నింటిని తెరచినప్పటికీ, కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపింది. ఈ అంశాలన్నీ ఆదాయంపై ప్రభావం చూపగలవని పేర్కొంది. ఆదాయ అంచనాలను అందుకోలేమని స్పష్టం చేసింది.
ఈ మార్చి క్వార్టర్‌లో ఆదాయం 6,300 కోట్ల డాలర్ల నుంచి 6,700 కోట్ల డాలర్ల మేర (రూ.4.5–4.7 లక్షల కోట్లు)ఆదాయం రాగలదని యాపిల్ అంచనా వేసింది. ఐఫోన్‌లు అత్యధికంగా అమ్ముడయ్యే అతి పెద్ద మూడో మార్కెట్ చైనాయే. చైనా కాకుండా ఇతర మార్కెట్లలో అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయని యాపిల్ పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు త్వరలోనే నెలకొనగలవని అంచనా వేశామని, ఈ అంచనాలు తప్పాయని పేర్కొంది. కాగా కరోనా కాటు యాపిల్‌పైనే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలపై కూడా పడింది. యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్, వాహన దిగ్గజం టయోటా, స్పోర్ట్స్‌వేర్ కంపెనీలు నైకీ, ఆడిడాస్‌లు కూడా తమ ఆదాయంపై కరోనా ప్రభావం ఉండగలవని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment