చమురు పతనంతో సంస్కరణలకు చాన్స్
* జీడీపీ 5.5% పురోగమిస్తుంది
* ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో కుప్పకూలుతున్న ముడిచమురు ధరలు దేశీయంగా సంస్కరణల అమలుకు జోష్‌నిస్తాయని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) పేర్కొంది. దేశ జీడీపీ పురోగమన పథంలో ఉన్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో 5.5% వృద్ధి సాధించే అవకాశమున్నదని అంచనా వేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.7%, ద్వితీయ త్రైమాసికం(క్యూ2)లో 5.3% చొప్పున ఆర్థిక వ్యవస్థ పురోగమించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ద్వితీయార్థంలో మందగమన పరిస్థితులు తలెత్తినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు సుస్థిర బాటలో కొనసాగే అవకాశమున్నదని అభిప్రాయపడింది. కాగా, పతనమవుతున్న చమురు ధరలు పలు ఆసియా దేశాలకు వరంగా మారనున్నాయని వ్యాఖ్యానించింది. తద్వారా లాభదాయక సంస్కరణలకు వీలుచిక్కనుందని తెలిపింది. చమురును దిగుమతి చేసుకునే ఇండియా, ఇండోనేసియా వంటి దేశాలు సబ్సిడీ చెల్లింపుల వంటి కార్యక్రమాలలో సంస్కరణలకు తెరలేపుతాయని ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త షాంగ్‌జిన్ వేయ్ పేర్కొన్నారు. జీడీపీ 6.3% వృద్ధిని సాధించాలంటే మరిన్ని నిర్మాణాత్మక చర్యలను చేపట్టాల్సి ఉంటుందని సూచించారు.