న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కార్పొరేట్ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం సీఎస్‌ఆర్ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్‌ఆర్ రిపోర్టింగ్ సర్వే వెల్లడించింది. సీఎస్‌ఆర్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.., 2014–15 నుంచి 2017–18 మధ్య కాలానికి టాప్ 100 కంపెనీల మొత్తం సీఎస్‌ఆర్ వ్యయాలు రూ.26,385 కోట్లకు పెరిగాయి. ఒక్కో కంపెనీ సగటు సీఎస్‌ఆర్ వ్యయం 2014–15లో రూ.59 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 29 శాతం వృద్ధితో రూ.76 కోట్లకు ఎగసింది.
సీఎస్‌ఆర్ కోసం కేటాయించి వ్యయం చేయని సొమ్ములు 2014–15లో రూ.1,738 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.749 కోట్లు తగ్గి రూ.989 కోట్లకు పడిపోయింది. సీఎస్‌ఆర్ వ్యయాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. సీఎస్‌ఆర్ కమిటీ కార్యకలాపాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. డైరెక్టర్ల బోర్డ్ సమావేశాల్లో కూడా సీఎస్‌ఆర్ వ్యయాల ప్రస్తావన పెరుగుతోంది. ఇంధన, విద్యుత్తు రంగ కంపెనీలు అధికంగా సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ రంగంలోని కంపెనీలు సీఎస్‌ఆర్ కోసం రూ.2,465 కోట్లు ఖర్చు చేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ(రూ.1,353 కోట్లు), వినియోగ వస్తు కంపెనీలు(రూ.635 కోట్లు), ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, లోహ కంపెనీలు నిలిచాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment