నకిలీ లింక్డ్‌ఇన్ అకౌంట్లతో మోసాలు
సైబర్ నేరగాళ్ల విన్యాసాలపై సిమాంటిక్ నివేదిక
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను మోసం చేస్తున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే సిమాంటిక్ సంస్థ తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలిస్తామంటూ నకిలీ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్ సమాచారాన్ని సేకరిస్తారని పేర్కొంది. ఆ తర్వాత ఈ సమాచారంతో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తారని వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌కు 40 కోట్ల మంది యూజర్లున్నారని, గత ఏడాది ఈ తరహా మోసాలు చాలా జరిగాయని పేర్కొంది. కంపెనీలు నిర్వహిస్తున్నామని లేదా స్వయం ఉపాధి పొందుతున్నామని ఉద్యోగులు కావాలంటూ సైబర్ నేరగాళ్లు మహిళల ఫొటోలతో బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షిస్తారని వివరించింది. టిన్‌ఐ, గూగుల్ ఇమేజ్ సెర్చ్ వంటి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ నకిలీ ప్రొఫైల్స్‌ను గుర్తించగలిగామని పేర్కొంది. ఇతరులను తమ నెట్‌వర్క్‌కు జత చేసుకునేముందు లింక్డ్‌ఇన్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఉద్యోగాలిస్తామంటూ ఆఫర్లిచ్చే లింక్డ్‌ఇన్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.