ముంబై: డిజిటల్ మాధ్యమం ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో కంపెనీలు ఈ తరహా ప్రకటనలపై మరింతగా వెచ్చిస్తున్నాయి. డిజిటల్ ప్రకటనలపై కంపెనీలు చేస్తున్న వ్యయాలు ఏటా 30% పెరుగుతున్నాయి. 2017 ఆఖరుకి రూ. 9,266 కోట్లుగా ఉన్న ఈ వ్యయాలు.. ఈ ఏడాది చివరికి రూ.12,046 కోట్లకు చేరనున్నాయి. డిజిటల్ ప్రకటనలపై గతేడాది భారత్‌లో కంపెనీల వ్యయాలపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఏఎంఏఐ), కాంటార్ ఐఎంఆర్‌బీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
2017 ఆఖరు నాటికి వివిధ మాధ్యమాల్లో మొత్తం ప్రకటనల వ్యయాలు రూ. 59,000 కోట్లు కాగా.. అందులో డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యయాల వాటా 16%. విభాగాల వారీగా... బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) కంపెనీలు డిజిటల్ ప్రకటనలపై అత్యధిక స్థాయిలో రూ. 2,022 కోట్లు వెచ్చించాయి. ఈ–కామర్స్ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నాయి.
పెరుగుతున్న మొబైల్ ప్రకటనలు..: డిజిటల్ మీడియాలో బీఎఫ్‌ఎస్‌ఐ బ్రాండ్స్ ప్రకటనల వాటా 46 శాతంగా ఉన్నట్లు, ఈ–కామర్స్, టెలికం, ట్రావెల్ విభాగాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం డిజిటల్ ప్రకటనల్లో ఈ 4 విభాగాల సంస్థల వాటా 68%. మొత్తం డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో సోషల్ మీడియా వాటా 18%(సుమారు రూ. 1,668 కోట్లు) ఉంది.
అటు మొబైల్ అడ్వర్టైజింగ్‌పై (ఎస్‌ఎంఎస్.. ఇన్ యాప్ యాడ్స్) చేసే వ్యయాలు వార్షికంగా 34% పెరిగి రూ.1,314 కోట్ల నుంచి రూ. 1,761 కోట్లకు చేరాయి. డేటా చార్జీలు గణనీయంగా తగ్గిపోవడం, అందుబాటు ధరల్లో హ్యాండ్‌సెట్స్ మొదలైన అంశాల కారణంగా మొబైల్ అడ్వర్టైజింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
డిజిటల్‌పై పెట్టుబడులతో లాభాలు: డబ్ల్యూఈఎఫ్
డిజిటల్ టెక్నాలజీలపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడంతో పాటు కార్పొరేట్ల లాభాలు మెరుగుపడుతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. అయితే, అన్ని స్థాయిల సంస్థల్లోనూ ఈ ధోరణి లేదని, ప్రతి రంగం నుంచి కేవలం టాప్ 20 శాతం సంస్థలు మాత్రమే డిజిటల్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తున్నాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment