అంత డబ్బు ఎక్కడిదో చెప్పండి | Disclose source of cash, Supreme Court tells Sahara | Sakshi
Sakshi News home page

అంత డబ్బు ఎక్కడిదో చెప్పండి

Published Sat, Sep 3 2016 12:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అంత డబ్బు ఎక్కడిదో చెప్పండి - Sakshi

అంత డబ్బు ఎక్కడిదో చెప్పండి

కస్టమర్లకు రూ.25,000 కోట్లు చెల్లించేశామన్న సహారా వాదనపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
రుజువు చూపిస్తే... కేసు మూసేస్తామని సూచన

న్యూఢిల్లీ: మదుపరులకు చెల్లించాల్సిన రూ.25,000 కోట్లు చెల్లించేశామన్న సహారా గ్రూప్ వాదనపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది.  అసలు అంతడబ్బు కేవలం రెండు నెలల్లో ఎలా సమకూరిందో చెప్పాలని సహారా తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది. దీనికి రుజువు చూపిస్తే... కేసు మూసేస్తామనీ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇంత పెద్ద మొత్తం ఆకాశం నుంచి ఊడిపడదుకదా? అని ప్రశ్నిస్తూ ఇది తనకు మింగుడుపడని అంశమని పేర్కొంది. ‘‘మీకు (సహారా గ్రూప్) అంత డబ్బు ఎలా వచ్చింది?.

  ఇతర కంపెనీల నుంచి పొందారా లేక ఇతర స్కీమ్‌ల నుంచి సంపాదించారా? బ్యాంక్ అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేశారా? లేదా ఆస్తులు ఏవైనా అమ్మారా?. వీటిలో ఏదో మార్గం నుంచి మీరు డబ్బును సమీకరించి ఉండి ఉండాలి. డబ్బు ఆకాశం నుంచి రాలి పడదుకదా?. మీ క్లెయింట్‌కు డబ్బు చెల్లించే సామర్థ్యం ఉందన్న విషయంలో మాకు సందేహాలు లేకపోవచ్చు. కానీ డబ్బు ఎలా వచ్చిందనేదే ఇక్కడ ముఖ్యం. ఈ డాక్యుమెంట్లు చూపించండి. తగిన డాక్యుమెంట్లు చూపిస్తే... కేసునూ మూసేస్తాం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.  కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. అసలు తాము ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించేశామని, మదుపుదారులను గుర్తించడంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వైఫల్యం చెందుతోందని సహారా న్యాయవాది కపిల్ సిబల్ వాదన నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా కీలక వ్యాఖ్యలు చేసింది.

రుణ సమీకరణకు అడ్డంకులు ఉండవు...
కాగా రూ.10,000 కోట్లు చెల్లించి సహారా చీఫ్ రాయ్ మధ్యంతర బెయిల్ పొందడానికి విదేశీ రుణం సమీకరించుకోడానికి అనుమతించాలన్న సహారా పిటిషన్‌ను పరిశీలించి, తగిన స్పందనను తెలియజేయాలని సైతం సెబీకి ఈ సందర్బంగా సుప్రీంకోర్టు సూచించింది. నిధుల సమీకరణకు ఎప్పుడూ అత్యున్నత న్యాయస్థానం అడ్డంకులు సృష్టించలేదన్నది గమనార్హమని పేర్కొంది. బ్రిటన్ రూబిన్ బ్రదర్స్ నుంచి నిధులు సమీకరించుకోడానికి అనుమతించాలని సహారా తన తాజా పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది.  సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు గతంలో పొడిగించింది.

అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని అప్పట్లో స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు-  మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి  సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లకు సంబంధించి... సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ, పెరోల్‌పై కొనసాగుతున్నారు. జూలై 11వ తేదీ ఆదేశాల మేరకు ఆగస్టులో  నిర్దేశిత రూ.300 కోట్లు చెల్లించడంతో ఆయన సెప్టెంబర్ 16 వరకూ  పెరోల్ గడువు పొడిగింపు ఉత్తర్వ్యును పొందగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement