
డీఎల్‌ఎఫ్‌పై నిషేధంతో ఫండ్స్‌లో అయోమయం
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌పై సెబీ నిషేధం... మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలను అయోమయానికి గురిచేస్తున్నాయి. 2007లో ఐపీఓ సందర్భంగా కంపెనీకి సంబంధించిన కొంత సమాచారాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందన్న కారణంగా డీఎల్‌ఎఫ్, దాని వ్యవస్థాప చైర్మన్ కేపీ సింగ్‌తోపాటు మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లపై సెబీ మూడేళ్లపాటు నిషేధం విధించడం తెలిసిందే. దీనివల్ల డీఎల్‌ఎఫ్ సుమారు రూ.2,500 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎంఎఫ్‌లకూ సెబీ నియంత్రణ సంస్థే.
అయితే, స్టాక్ మార్కెట్లకు సంబంధించి నిర్ణయాలన్నింటినీ ఫండ్స్‌పైనా రుద్దకూడదని ఒక ఎంఎఫ్ సంస్థకు చెందిన సీఈఓ అభిప్రాయపడ్డారు. కాగా, సెబీ నిషేధ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)లో సవాలు చేసిన డీఎల్‌ఎఫ్... ఫండ్స్ యూనిట్ల విక్రయంతోపాటు దేశీయంగా రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు వీలుగా మధ్యంతర ఉపశమనం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసింది. డీఎల్‌ఎఫ్ పిటిషన్‌ను ఈ నెల 30న శాట్ విచారించనుంది.