
ఇన్వెస్ట్‌మెంట్ అనగానే... ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ అన్న ప్రశ్నలు ప్రతి ఇన్వెస్టర్‌లోనూ తలెత్తుతాయి. వీటికి సమాధానాలు కావాలంటే ముందు మీ అవసరాలను అర్థం చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు... ఎంత రిస్క్ తీసుకోగలరు? సంపాదనలో ఎంత మొత్తాన్ని పక్కన పెట్టగలరు? అనే అంశాలపై ముందు స్పష్టత అవసరం. సంపద సృష్టించే దిశగా అడుగులు వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
మీ లక్ష్యం ఏంటి?
ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా గానీ... దాన్ని ప్రారంభించే ముందే మీ లక్ష్యం గురించి మీలో స్పష్టత ఉండాలి. పన్నుల ఆదా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? సంపద సృష్టి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీ కలల సాకారం కోసమా? ఇంటి కొనుగోలు కోసమా? ఇలా మీ లక్ష్యం ఏదన్న స్పష్టత తెచ్చుకుంటే ఆ దిశగా ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
ఎంతకాలం?
మీ లక్ష్యానికి ఎంత కాలం మీ చేతిలో ఉంది? ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాల వ్యవధి ఉండాలి. నిర్ణీత సమయంలోగా దాన్ని మీరు సాధించాలి. దీన్నే ఇన్వెస్ట్‌మెంట్ పరిభాషలో హొరైజన్‌గా పేర్కొంటారు. ఉదాహరణకు మీ బాబు లేదా పాప కాలేజీలో చేరేందుకు 15 ఏళ్ల కాల వ్యవది ఉందనుకోండి. అప్పుడు కాలేజీ విద్యకు అవసరమైన నిధిని సమకూర్చుకునేందుకు... ఇన్వెస్ట్ చేయడానికి మీకు 15 ఏళ్ల సమయం ఉన్నట్టు.
ఎంత మొత్తం పక్కన పెట్టాలి?
సాధారణ సంపాదన నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌కు కొంత పక్కన పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెలా లేదా క్వార్టర్ (మూడు నెలలు) లేదా ఏడాదికోసారి ఎంత పక్కన పెట్టగలరు? దీనివల్ల సాధారణ వ్యయాలు, లిక్విడిటీపై ప్రభావం పడకూడదు. మీకంటూ ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయగలరు అన్నది మీరే నిర్ణయించుకోగలరు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా వాస్తవిక లెక్కింపుతో దానిపై స్పష్టతకు రావాలి.
రిస్క్‌లు ఏంటి?
చాలా వరకు పెట్టుబడి సాధనాలకు రిస్క్ అనేది ఉంటుంది. సంప్రదాయ సాధనాలుగా భావించే కొన్నింటిలోనూ రిస్క్ సహజం. ఈ రిస్క్ అన్నది కేవలం రాబడులకే పరిమితం కాదు, ద్రవ్యోల్బణం రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ల అస్థిరతలు, వడ్డీరేట్లలో మార్పులు, క్రెడిట్ రేటింగ్‌లు, ఎక్సే్ఛంజ్ రేట్లలో ఆకస్మిక మార్పులు తదితర అంశాలపై రిస్క్ ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని రకాల రిస్క్‌లను అర్థం చేసుకోవాలి.
ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడులు ఎంత?
ప్రతి సాధనం కూడా ప్రత్యేకమైన రాబడులను అందించే విధానంతో ఉంటుంది. మీ లక్ష్యానికి తగ్గట్టు ఆ రాబడులు సరిపోలుతున్నాయా అన్నది చూసుకోవాలి. ఉదాహరణకు దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్నది మీ లక్ష్యమైతే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బదులు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రాబడుల గురించి ఏజెంట్ మాటలతో చెప్పేవి లెక్కలోకి తీసుకోవద్దు. ఇన్వెస్ట్‌మెంట్ పత్రాల్లో పేర్కొన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాలి.
పన్ను ప్రయోజనాలు?
చాలా వరకు రాబడులపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకు 7 శాతం రాబడులను ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకుంటే, మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉన్నారనుకోండి. పన్ను అనంతరం వచ్చే 4.9 శాతం రాబడులు అవసరాలను తీర్చలేని స్థాయిలో ఉంటాయి. దీనికి బదులు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది పూర్తిగా పన్ను మినహాయింపు ఉన్న సాధనం. అలాగే, ఈక్విటీలో పెట్టుబడులకూ పన్ను ప్రయోజనం ఉంది. ఏడాదికి మించి ఈక్విటీల్లో పెట్టుబడుల కొనసాగింపు ద్వారా వచ్చే రాబడులపై పన్ను ఉండదు. ఎంచుకున్న సాధనం పన్ను పరంగా ప్రయోజనకరంగా ఉంటే మీ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు.
చార్జీలు ఎంత?
పెట్టుబడి సాధనంపై సంతకం చేసే ముందు ఆ పథకంలో భాగంగా చెల్లించాల్సిన చార్జీలు, కమిషన్ల గురించి పరిశీలించాలి. ఎందుకంటే ఈ చార్జీలు తుది రాబడులపై ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి గురించి తెలుసుకోవడం అవసరం.
ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి?
ఒక్క ఉత్పత్తికే అతుక్కుపోకూడదు. ఇన్వెస్టర్‌గా మీ పెట్టుబడి సాధనాన్ని ఇతర సాధనాలతో పోల్చి చూసి మీ లక్ష్యాన్ని త్వరగా చేరేందుకు అనువైనదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
పెట్టుబడులను నగదుగా మార్చుకునేది ఎలా?
అవసరమైనప్పుడు మీ డబ్బు మీకు అందుబాటులో ఉండాలి. కనుక పెట్టుబడులను నగదుగా మార్చుకునేందుకు పథకం నియమ, నిబంధనలు వీలు కల్పిస్తున్నాయా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి సాధనాల్లో ఎగ్జిట్‌లోడ్, లాకిన్ పీరియడ్స్, పెనాల్టీలు, ఉపసంహరణకు పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులను అర్థం చేసుకోవడం ద్వారా లిక్విడిటీ సమస్య ఏర్పడకుండా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment