
సాక్షి, న్యూఢిల్లీ : కార్ల విక్రయాలు వరుసగా పడిపోతుండటం ఆర్థిక వ్యవస్థ దురవస్థపై గుబులు రేపుతోంది. వడ్డీ రేట్లు తగ్గించినా, కార్ల ధరలు తగ్గించి ఆఫర్లు అందిస్తున్నా ప్రయాణీకుల వాహన విక్రయాలు నేలచూపులు చూస్తుండటం విధాన నిర్ణేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆర్థిక మందగమనానికి సంకేతాలుగా భావిస్తున్న ఆటోమొబైల్ సేల్స్ ఆగస్ట్‌లోనూ దారుణంగా పడిపోయాయి. వాహనాల విక్రయాలు ఇటీవల మందకొడిగా సాగుతున్న క్రమంలో విడుదలైన తాజా గణాంకాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్ట్‌లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, హోండా కార్స్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం కంపెనీల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని ఈ గణాంకాలు వెల్లడించాయి. పండుగ సీజన్ అయినా అమ్మకాల్లో ఊపును తీసుకువస్తుందని ఆటోమొబైల్ సంస్థలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి అన్ని మోడల్స్ కలుపుకుని 1,45,895 వాహనాలను విక్రయించగా ఈ ఏడాది ఆగస్ట్‌లో విక్రయించిన వాహనాల సంఖ్య ఏకంగా 31 శాతం పతనమై 93,173 వాహనాలుగా నిలిచింది. హ్యుండాయ్ మోటార్స్ గత ఏడాది ఆగస్ట్‌లో మొత్తం 45,801 వాహనాలు విక్రయించగా ఇప్పుడు వాటి సంఖ్య 38,205 వాహనాలకు పరిమితమైంది. హోండా కార్స్ గత ఏడాది ఆగస్ట్‌లో 17,020 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది ఆగస్ట్‌లో వాహన విక్రయాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. ఇక ఎంఅండ్‌ఎం గడిచిన ఏడాది ఆగస్ట్‌లో 19,578 యూనిట్లను విక్రయించగా ఈ ఆగస్ట్‌లో వాటి సంఖ్య 13,507కు పతనమైంది. మరోవైపు కియా మోటార్స్, ఎంజీ (మోరీస్ గ్యారేజెస్) వంటి నూతన ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు కొంతమేర ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కియా మోటార్స్ ఆగస్ట్ 22న తన వాహనాన్ని లాంఛ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆగస్ట్‌లో 6200 సెల్టోలు అమ్ముడవడం గమనార్హం. ఎంజీ మోటార్ సైతం ఆగస్ట్‌లో 2018 హెక్టార్ వాహనాలను విక్రయించింది. ఆటో సేల్స్‌లో మందగమనంతో ఆటోమొబైల్ కంపెనీలన్నీ పండగ సీజన్‌పై ఆశలు పెంచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment