యూరోజోన్‌కు ఉద్దీపన ఆక్సిజన్!
ఈసీబీ 1.1 ట్రిలియన్ యూరోల సహాయ ప్యాకేజీ
ఫ్రాంక్‌ఫర్ట్: యూరోజోన్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇవ్వడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఆర్థిక సహాయక చర్యలను గురువారం ప్రకటించింది. ఈ ఉద్దీపన విలువ దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్లు. 2015 మార్చి నుంచి 2016 సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం జరుగుతుందని ఈసీబీ ప్రెసిడెంట్ మారియో డ్రాఘీ ప్రకటించారు. ఈ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం వల్ల మొత్తం యూరోజోన్ ఎకానమీలో కొత్త ఊపును తెస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సంబంధించి నెలకు 60 బిలియన్ యూరోల సెక్యూరిటీలను (బాండ్ల)ను ఈసీబీ కొనుగోలు చేయనున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ తెలిపారు. అంటే వ్యవస్థలోకి నెలకు 60 బిలియన్ డాలర్ల యూరోలు వస్తాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, డిమాండ్ పెంపు, మందగమనంలో నడుస్తున్న యూరో ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా ఉత్సాహాన్ని అందించడం తాజా ఉద్దీపన నిధుల లక్ష్యమని అన్నారు. ఈ నిర్ణయం వల్ల కొన్ని దేశాల్లో వ్యయాలు పెరిగి, ఆర్థిక సంస్కరణలు నీరుగారతాయని జర్మనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, మొత్తం యూరో వృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు.
గ్యాపప్‌తో భారత సూచీలు!
యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ.. అంచనాలను మించడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌టీఎస్‌ఈ, డ్యాక్స్, సీఏసీ-40లు 11.5% మేర పెరిగాయి. ఇదే జోరును అమెరికా మార్కెట్లు కొనసాగించాయి. గురువారం రాత్రి ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,847 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) భారత స్టాక్ మార్కెట్లు గ్యాప్ అప్‌తో మొదలవుతాయనేది విశ్లేషకుల అంచనా.