సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ నివాసం, కార్యాలయాలపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫెమా నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీలో గోయల్‌కు చెందిన నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు నగదు కొరతతో ఏప్రిల్ 17న జెట్ ఎయిర్‌వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్‌లైన్ చైర్మన్‌గా నరేష్ గోయల్ ఈ ఏడాడి మార్చిలో వైదొలిగారు. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్‌లో ఐబీసీ కోడ్ కింద దివాళా ప్రక్రియ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment