విద్యారుణాలు, స్కాలర్‌షిప్‌లకు ‘’విద్యాలక్ష్మి’ పోర్టల్! | Educational loans, scholarships to vidyalaksmi portal | Sakshi
Sakshi News home page

విద్యారుణాలు, స్కాలర్‌షిప్‌లకు ‘’విద్యాలక్ష్మి’ పోర్టల్!

Published Mon, Aug 31 2015 12:10 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

విద్యారుణాలు, స్కాలర్‌షిప్‌లకు ‘’విద్యాలక్ష్మి’ పోర్టల్! - Sakshi

విద్యారుణాలు, స్కాలర్‌షిప్‌లకు ‘’విద్యాలక్ష్మి’ పోర్టల్!

అన్ని రకాల ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, అందుబాటులో ఉన్న విద్యా రుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవటానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ఆరంభించింది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాలక్ష్మి.కో.ఇన్’ పేరిట ఉన్న ఈ వెబ్‌సైట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కలిసి ఆరంభించాయి.

విద్యార్థులు విద్యారుణాల గురించి గానీ, స్కాలర్‌షిప్‌ల గురించి గానీ తెలుసుకోవటానికి, ఒకవేళ అర్హతలుంటే అక్కడి నుంచే వాటికి దరఖాస్తు చేసుకోవటానికి ఈ పోర్టల్ సింగిల్ విండో మాదిరిగా పనిచేస్తుంది. ఇంకో విశేషమేంటంటే విద్యార్థులు ఒకే ఒక ఉమ్మడి విద్యారుణ దరఖాస్తు ద్వారా వివిధ బ్యాంకులకు ఇక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు ఈ దరఖాస్తుల్ని డౌన్‌లోడ్ చేసుకుని, అర్హతలను బట్టి సదరు విద్యార్థుల్ని సంప్రతిస్తాయి. విద్యార్థులు తమ ఫిర్యాదులను కూడా ఇక్కడి నుంచే ఈ-మెయిల్ చేయొచ్చు. ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ లింకేజీ ద్వారా... ఏఏ స్కాలర్‌షిప్ పరిస్థితి ఏంటన్నది ఇక్కడే తెలుసుకోవచ్చు.
 
డబ్బులు లేవన్న కారణంతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదని ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆయన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం (పీఎంవీఎల్‌కే) పరిధిలో విద్యార్థులకు పూర్తిస్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో తొలి అడుగుగా ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్‌లో దాదాపు 13 బ్యాంకులు 22 రకాల విద్యారుణాలను నమోదు చేశాయి. ఎస్‌బీఐ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లైతే తమ విద్యా రుణ వ్యవస్థను ఈ పోర్టల్‌తో అనుసంధానం చేశాయి కూడా. ఈ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌కు చెందిన ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement