బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
భీమవరం అర్బన్: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి బీఎస్ రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులను జాతీయం చేయక ముందు 1969లో దేశంలో 6 వేల శాఖలు మాత్రమే ఉండేవన్నారు.
మొత్తం టర్నోవర్ రూ.4,600 కోట్ల డిపాజిట్లు , రూ.3,800 కోట్ల రుణాలు , రూ.100 కోట్ల వ్యవసాయ రుణాలుకాగా 12 వేల మంది ఉద్యోగస్తులు ఉండేవారన్నారు. ప్రస్తుతం 1.21 లక్షల శాఖలు ఉన్నాయని, రూ.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.60 లక్షల కోట్ల రుణాలు, రూ.7 లక్షల 70 వేల కోట్ల పంట రుణాలు అందించామన్నారు. 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రూ.44 వేల కోట్ల నికరలాభం చూపిస్తున్నారన్నారు.
బ్యాంకుల జాతీయీకరణ తర్వాతే దేశంలో అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరిస్తే పూర్వ పరిస్థితి తలెత్తుతుందన్నారు. జాతీయ బ్యాంకుల్లో 51 శాతం ప్రభుత్వ వాటాకాగా, 49 శాతం ప్రైవేట్ వాటా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను 6 బ్యాంకులుగా కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. విలీనం వల్ల పెద్ద బ్యాంకులు ఏర్పడతాయేకానీ బలమైన బ్యాంకులు కాలేవన్నారు.
మొండి బకాయిల సమస్య తీవ్రతరం...
ప్రస్తుతం బ్యాంకులను మొండి బకాయిల సమస్య పట్టిపీడిస్తోందని రాంబాబు తెలిపారు. 2010 సంవత్సరంలో రూ.40 వేల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు ప్రస్తుతం రూ.2 లక్షల 6 వేల కోట్లకు పెరిగిపోయాయని పేర్కొన్నారు. కావాలని రుణాలు ఎగవేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రుణాలు ఎగవేసే వారి ఆస్తులను జప్తు చేసి, సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్పుచేయాలన్నారు. మొండి బకాయిల విషయంలో ప్రస్తుతం 2 లక్షల 5 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రికవరీ చేసేందుకు ఏర్పాటు చేసిన డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ విఫలం అవుతున్నాయన్నారు.
రుణమాఫీ హామీతో బ్యాంకులకు ఇబ్బందులు
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ బ్యాంకులకు ఇబ్బందిగా మారిందని రాంబాబు చెప్పారు. రుణమాఫీ అనేది ప్రభుత్వానికి, రైతులకు సంబంధించినదని... బ్యాంకులకు ఏమాత్రం సంబంధం లేని విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించాక వారంతా రుణాలను చెల్లించడంలేదన్నారు.
వాస్తవానికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పిందని... అయితే ఇప్పుడేమో రుణాలను రీషెడ్యూల్ చేస్తామని చెబుతున్నారన్నారు. దీంతో బ్యాంకుల వద్ద కొత్తగా రుణాలు ఇచ్చేందుకు నిధులు లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకులకు రావడంలేదని చెప్పారు. సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉదయభాస్కర్, భీమవరం బ్యాంకు ఎంప్లాయీస్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.