
న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారుల నెత్తిన త్వరలో మరింత పన్ను పోటుకు రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా.. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్సు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ద్విచక్రవాహనాలు మొదలుకుని కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల దాకా అన్నింటిపై సుమారు రూ. 500– రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనుంది. ఈ వివాదాస్పద ప్రతిపాదన సహా పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించేందుకు గురువారం కేంద్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా సారథ్యంలో కార్యదర్శుల కమిటీ భేటీలో నీతి ఆయోగ్ చేసిన ‘ఫీబేట్’ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు వివరించాయి.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో పాటు భారీ పరిశ్రమలు, విద్యుత్, ఆర్థిక సర్వీసులు, రెవెన్యూ, పెట్రోలియం తదితర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఇందులో పాల్గొననున్నారు. కాలుష్య కారక వాహనాలపై సెస్సు విధించడం, పర్యావరణ అనుకూల వాహనాలకు (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు) సబ్సిడీ అందించడం ఈ ఫీబేట్ ప్రతిపాదన ఉద్దేశం. దీని ప్రకారం ఉద్గారాలు వెలువరించే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ)తో పని చేసే ద్విచక్ర వాహనాలపై సగటున రు. 500 మేర ఫీబేట్ విధించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, త్రిచక్ర వాహనాలపై రూ. 1,000, కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలపై రూ. 12,000, బస్సులు.. ట్రక్కులు తదితర వాణిజ్య వాహనాలపై రూ. 25,000 మేర ఫీబేట్ విధించాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లుపేర్కొన్నాయి.
రూ. 7,646 కోట్ల సమీకరణ.. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించగలిగే దిశగా తొలి ఏడాది లో అదనపు ఆదాయ మార్గాల ద్వారా రూ. 7,646 కోట్లు సమీకరించేలా నీతి ఆయోగ్ ప్రతిపాదనలు ఉన్నాయి. 2019 ఏప్రిల్‌లో ప్రారంభమై ఆ తర్వాత అయిదేళ్ల వ్యవధిలో ఐసీఈ వాహనాలపై సెస్సు రూ. 7,646 కోట్ల నుంచి క్రమంగా రూ. 43,034 కోట్ల దాకా చేరొచ్చని సంబంధిత వర్గాల అంచనా. ఇలా ఫీబేట్ ద్వారా సమీకరించిన నిధులను ఫేమ్ ఇండియా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించనున్నారు.
ఆటోమొబైల్ పరిశ్రమ అభ్యంతరాలు
ఇలా ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సాంప్రదాయ వాహనాలపై సెస్సులు విధించడం సరికాదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎక్కువగా చిన్న కార్లు వినియోగించే భారత్ వంటి దేశంలో సబ్సిడీలతో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలమయంగా చేయాలన్న ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కాగలదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు. ‘సబ్సిడీల ప్రాతిపదికన చిన్న కార్ల ఎలక్ట్రిఫికేషన్ సాధ్యపడుతుందని వ్యక్తిగతంగా నేనైతే భావించడం లేదు. ఇందుకోసం టెక్నాలజీ అవసరం అంతే తప్ప. సబ్సిడీలివ్వడమనేది లాభసాటి మార్గమని అనుకోవడం లేదు. సబ్సిడీలతో పెద్ద కార్లున్న సంపన్నులే లాభపడతారు తప్ప.. లక్ష్యం నెరవేరదు’అని ఆయన అభిప్రాయపడ్డారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలొక్కటే మార్గం కాదని.. ఇతరత్రా హైబ్రీడ్, బయోఫ్యుయల్స్, సీఎన్‌జీ వాహనాలను కూడా ప్రోత్సహించే అంశం పరిశీలించవచ్చన్నారు.
ఈవీలపై రూ. 50 వేల దాకా సబ్సిడీ..
నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం ఫీబేట్ అమలు చేసే తొలి ఏడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ. 25,000, త్రిచక్ర వాహనాలకు రూ. 40,000, ఎలక్ట్రిక్ కారుకు రూ. 50,000 దాకా సబ్సిడీ అందించనున్నారు. ఇది నేరుగా నగదు బదిలీ రూపంలో ఉంటుంది. కాలుష్యకారక వాహనాలపై సెస్సు విధించి, పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసేవారికి రిబేటునిచ్చే విధానాన్నే ఫీబేట్‌గా వ్యవహరిస్తా రు. నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగా భారీ స్థాయిలో ఉండే ద్విచక్ర వాహనదారులపై ఫీబేట్ విధించడం వారిపై మరింత భారం మోపడమే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై గతంలో భారీ పరిశ్రమల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment