
ముంబై: ఇప్పటికే వివిధ విభాగాల్లో మొండిబాకీలతో బ్యాంకులు సతమతమవుతుంటే.. తాజాగా విద్యుత్ రంగానికిచ్చిన రుణాలు వాటికి భారీ షాకివ్వనున్నాయి. కొత్తగా విద్యుత్ సంస్థలకిచ్చిన రుణాల్లో దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల మొత్తాన్ని రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్ (బీవోఎఫ్‌ఏ–ఎంఎల్) ఒక నివేదికలో వెల్లడించింది. ‘విద్యుత్ రంగం రుణభారం 178 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 11.7 లక్షల కోట్లు) ఉంది. ఇందులో సుమారు 53 బిలియన్ డాలర్ల (రూ. 3.5 లక్షల కోట్లు) మొండిబకాయిల్లో .. దాదాపు 38 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.5 లక్షల కోట్లు) రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది‘ అని పేర్కొంది.
దాదాపు 71 గిగావాట్ల సామర్థ్యమున్న ప్రైవేట్ రంగ బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టులు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని బీవోఎఫ్‌ఏ–ఎంఎల్ ఈ నివేదికను రూపొందించింది. ఈ ప్రాజెక్టుల పరిష్కార ప్రక్రియ 2019 జూన్ నుంచి ప్రారంభం కావొచ్చని భావిస్తూ.. వీటికి సంబంధించిన రుణాల్లో సగటున 75 శాతం మేర లోన్స్‌ను రైటాఫ్ చేయాల్సి రావొచ్చని సంస్థ అంచనా వేసింది. బీవోఎఫ్‌ఏ–ఎంఎల్ రీసెర్చ్ అనలిస్టులు అమీష్ షా, శ్రీహర్‡్ష సింగ్ ఈ నివేదికను రూపొందించారు.
మొండిబాకీల కుప్పలు..
విద్యుత్ రంగానికి ఇచ్చిన 178 బిలియన్ డాలర్ల రుణాల్లో పంపిణీ సంస్థలు 65 బిలియన్ డాలర్లు తీసుకోగా, ఉత్పత్తి సంస్థలు 77 బిలియన్ డాలర్లు, సరఫరా సంస్థలు 36 బిలియన్ డాలర్ల లోన్స్ పొందినట్లు నివేదిక పేర్కొంది. దాదాపు 53 బిలియన్ డాలర్ల నిరర్ధక ఆస్తుల్లో ఏకంగా 50 బిలియన్ డాలర్ల వాటా విద్యుదుత్పత్తి సంస్థలదే ఉంది. గతంలో పంపిణీ సంస్థలకిచ్చిన రుణాలపై కూడా ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన (ఉదయ్) స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత నుంచి రుణాల పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలతో ఈ విభాగం లోన్స్ కొంత మెరుగుపడ్డాయి.
ఇక, విద్యుత్ రంగానికి ఇచ్చిన మొత్తం 178 బిలియన్ డాలర్ల రుణాల్లో అత్యధికంగా 53 శాతం వాటా బ్యాంకులదే ఉండగా.. 35 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలది ఉంది. మిగతా రుణాలు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలిచ్చినవి ఉన్నాయి. ఇక శాతాలవారీగా వివిధ విభాగాలు చూస్తే మొత్తం రుణాల్లో విద్యుదుత్పత్తి సంస్థల వాటా 43 శాతం కాగా, పంపిణీ సంస్థలది 37 శాతం, ట్రాన్స్‌మిషన్ సంస్థలది 20 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వివరించింది.
రేటు పెంచడం పరిష్కారం కాదు..
విద్యుత్ సంస్థలు ఏటా 9 బిలియన్ డాలర్లు నష్టపోతున్నట్లు నివేదిక అంచనా వేసింది. పలు లోటుపాట్లను సమర్థంగా పరిష్కరించుకోగలిగితే.. విద్యుత్ చార్జీలు పెంచకుండా ఇవి టర్నెరౌండ్ కావడంతో పాటు సగటున ప్రస్తుతమిస్తున్న రెండు శాతం సబ్సిడీని కూడా నిరభ్యంతరంగా కొనసాగించడానికి వీటుంటుందని పేర్కొంది. ప్రస్తుతం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల వాటా అత్యధికంగా 37 శాతంగా ఉంది. ప్రాంతీయంగా చూస్తే ఇప్పటికే ఈ వర్గాల నుంచి వసూలు చేస్తున్న చార్జీలు చాలా అధికంగా ఉంటున్నందున.. విద్యుత్ రంగం టర్నెరౌండ్ కావడానికి టారిఫ్‌లను పెంచడం పరిష్కారమార్గం కాబోదని నివేదిక స్పష్టం చేసింది. లోటుపాట్లను సరిదిద్దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణలతో కేవలం పరిమితమైన పురోగతే కనిపించే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, రాష్ట్రాల వ్యయాల్లో విద్యుత్‌కి సంబంధించి రైతులకిచ్చే సబ్సిడీలు సగటున కేవలం రెండు శాతం మాత్రమే ఉంటున్నట్లు నివేదిక వివరించింది. మొత్తం విద్యుత్ వినియోగంలో 22% వాటాతో రైతాంగం రెండో స్థానంలో ఉంటోంది. కొన్ని రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పటికీ.. విద్యుత్ సంస్థలకు బడ్జెట్‌లలో కేటాయింపులు జరుపుతున్నాయి. మొత్తం మీద విద్యుత్ పంపిణీ సంస్థల వ్యయాలు ఏటా 116 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 54 శాతం భాగం.. మెయింటెనెన్స్, ఆపరేషన్స్, ఇతర వ్యయాలదే (అడ్మినిస్ట్రేషన్ వ్యయాలు, పన్నులు వగైరా) ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment