
విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించామన్న వార్తలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొట్టిపారేసింది. పుష్కలంగా మూలధన నిధులున్నాయని, ఖాతాదారులు, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఈ స్కామ్ నేపథ్యంలో ఖాతాదారులు భయపడాల్సిన పనిలేదంటూ పీఎన్‌బీ బుధవారం ట్వీట్ చేసింది. ఈ స్కామ్ కారణంగా తలెత్తిన సమస్యలను తట్టుకునేలా పుష్కలంగా మూలధన నిధులున్నాయని పేర్కొంది.
కరెంట్, సేవింగ్స్ ఖాతాల నిల్వలు (కాసా) పటిష్టంగా ఉన్నాయని, రుణ నాణ్యత స్థిరంగా ఉందని, డిజిటైజేషన్ జోరుగా ఉందని వివరించింది. తగినంతగా మూలధన నిధులతో పాటు కీలకం కాని ఆస్తులు కూడా పటిష్టంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితులను చక్కదిద్దగల స్థాయిలో ఉన్నామని, బ్యాంక్ ప్రయోజనాలను పరిరక్షించగలమని భరోసానిచ్చింది. విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించినట్లు కొన్ని చానెళ్లలో వస్తున్న వార్తలు నిరాధారమని పేర్కొంది.