జెట్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు  | EPF interest rate hiked to 8.65% ahead of Elections 2019 | Sakshi
Sakshi News home page

జెట్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు 

Published Sat, May 11 2019 12:02 AM | Last Updated on Sat, May 11 2019 12:02 AM

 EPF interest rate hiked to 8.65% ahead of Elections 2019 - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకుగానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జెట్‌ ఎయిర్‌వేస్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయిలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్‌ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్‌వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ దిలీప్‌ కే రాథోడ్‌ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్‌లైన్‌ సమర్పించిన బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

జెట్‌కు బిడ్స్‌ దాఖలు.. 
జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్‌బీఐ క్యాప్స్‌ వెల్లడించింది. సీల్డ్‌ కవర్‌లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్‌లో 31.2–75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్‌ తదితర సంస్థల నుంచి బిడ్స్‌ వచ్చినట్లు బిడ్డింగ్‌ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్‌బీఐ క్యాప్స్‌ పేర్కొంది. బ్యాంకులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి.  
షేరు 3 శాతం అప్‌..: జెట్‌ కొనుగోలు కోసం బిడ్స్‌ వచ్చాయన్న వార్తలతో షేరు శుక్రవారం 3 శాతం పెరిగింది.  రూ. 151.80 వద్ద క్లోజయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement