హైదరాబాద్: బ్యాటరీల తయారీలో ఉన్న బి.ఎమ్.ఖైతాన్ గ్రూప్ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్.. హైదరాబాద్‌లో ఉన్న స్థలాన్ని న్యూలాండ్ టెక్నాలజీస్‌కు విక్రయించింది. డీల్ విలువ రూ.100 కోట్లు. మౌలాలి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో ఇది నెలకొని ఉంది. విక్రయం ద్వారా వచ్చిన వనరులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎండీ అమృతాంశు ఖైతాన్ వెల్లడించారు. ఆర్థిక వనరులు లేకపోవడంతో ఇక్కడి ప్లాంటులో ఉత్పత్తి 2010 నుంచి నిలిచిపోయింది. 2018 డిసెంబరులో కంపెనీ చెన్నైలో ఉన్న స్థలాన్ని సైతం అమ్మింది. ఒలింపియా గ్రూప్ రూ.100 కోట్లకు దీనిని దక్కించుకుంది.
రుణాలను తగ్గించుకోవడమే..
ఎవరెడీకి పలు చోట్ల స్థలాలు ఉన్నాయి. ‘కీలకం కాని ఆస్తుల విక్రయమంటే కంపెనీ రుణాలను తగ్గించడమే. ఇక ఇతర స్థలాలు, ఆస్తుల విక్రయం ఆలోచన ఇప్పట్లో లేదు’ అని అమృతాంశు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న టీ వ్యాపారాన్ని ఈ ఏడాది జూలైలో మధు జయంతి ఇంటర్నేషనల్‌కు ఎవరెడీ రూ.6 కోట్లకే విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment