
రెరా నుంచి నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను మినహాయించండి!
► ఐదేళ్ల వారంటీని నిర్మాణ లోపాలకే పరిమితం చేయాలి
► అనుమతులు, ఎన్‌వోసీ, ఓసీ అన్నింటికీ ఏకగవాక్ష విధానం
► ప్రభుత్వానికి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వినతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లు అమలుకు శరవేగంగా అడుగులేస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని రెరా ముసాయిదా అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. దీంతో రెరా బిల్లులోని నిబంధనల్లో స్వల్ప మార్పుల కోసం తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను రెరా నుంచి మినహాయించాలని వారి ప్రధాన డిమాండ్. ఈ సందర్భంగా టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే..
► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను, అభివృద్ధి పనులన్ని పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్ట్‌లను, శ్లాబులు పూర్తయిన నివాస భవనాలను మినహాయించాలి. ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లను కనీసం రెండేళ్ల పాటు ఉపశమనం కల్పించాలి. ప్రధానంగా నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను రెరా నుంచి తొలగించకపోతే చాలా ఇబ్బందులొస్తాయి. ఎలాగంటే.. ఇప్పటికే ఆయా ప్రాజెక్ట్‌ల్లో కొంత విక్రయాలు, అది కూడా సూపర్ బిల్టప్ ఏరియా చొప్పున విక్రయించేశారు. ఇప్పుడు రెరా బిల్లులోకి నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను చేరిస్తే ధరల్లో తేడా ఉండటంతో పాత, కొత్త కస్టమర్లకు మధ్య ఇబ్బందులొస్తాయి. పైగా ఆయా ప్రాజెక్ట్‌లకు కూడా ఐదేళ్ల వారంటీ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఖాళీగా ఉన్న ఫ్లాట్ల చ.అ. ధరలను పెంచి విక్రయించాల్సి వస్తుంది. అప్పటికే ఆ ప్రాజెక్ట్‌లో కొన్న పాత కస్టమర్లకు, ఇప్పుడు కొనే కస్టమర్లకు ధరల్లో చాలా తేడా ఉంటుంది. ఇది అమ్మకాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
► ఐదేళ్ల వారంటీ నిబంధనను నిర్మాణ పరమైన లోపాలకు మాత్రమే పరిమితం చేయాలి. కొనుగోలుదారులకు ఫ్లాట్‌ను అందించిన రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఫ్లాట్‌కు వారంటీ ఇవ్వాలని రెరా అంటోంది. కానీ, వాస్తవానికి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందించాక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యత అపార్ట్‌మెంట్ నిర్వహణ సంఘానిది. అలాంటప్పుడు ఐదేళ్ల వారంటీ డెవలపర్ ఎలా ఇవ్వగలడు? నిర్మాణ లోపాలకు (స్ట్రక్చరల్) డెవలపర్ బాధ్యత ఉంటుంది గానీ ప్రాజెక్ట్‌లోని ఇతరత్రా ఉత్పత్తులు అంటే విద్యుత్ వైర్లు, రంగులు, టైల్స్, శానిటేషన్, లిఫ్ట్, జనరేటర్, మోటర్ల వంటి వాటికి కూడా వారంటీ ఇవ్వమనటం దారుణం. ఎందుకంటే పైన చెప్పిన ఏ ఉత్పత్తులను కూడా డెవలపర్ ఉత్పత్తి చేయడు. మరి అలాంటప్పుడు బిల్డర్ వారంటీ ఎలా ఇస్తాడు? పైగా షార్ట్ సర్క్యూట్స్, సహజ విపత్తులతో జరిగే ప్రమాదాలకు డెవలపర్లు బాధ్యత వహించలేరు.
► రెరాలోకి డెవలపర్లను, మధ్యవర్తులను మాత్రమే కాదు నిర్మాణ అనుమతులను మంజూరు చేసే ప్రభుత్వ విభాగాలనూ చేర్చాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, అగ్నిమాపక శాఖ ఇలా నిర్మాణ అనుమతులు, ఎన్‌వోసీ, ఓసీల జారీలో అనుబంధమై ఉన్న ప్రతీ విభాగాన్ని రెరా పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆయా విభాగాల్లో ఏ అధికారి సమయానికి అనుమతులు, ఎన్‌వోసీలు, ఓసీలు జారీ చేయకపోయినా నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీంతో వ్యయం పెరగడమే కాకుండా ఆలస్యమైనందుకు డెవలపర్లకు వడ్డన పేరిట అదనపు భారం నిబంధన ఉంది. సింగిల్ విండో ద్వారా అనుమతులు, ఎన్‌వోసీలు, ఓసీలను అందించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలి. ప్రభుత్వానికి జవాబుదారీ. ఒకవేళ అనుమతుల జారీలో అధికారి ఆలస్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
► కొనుగోలుదారులు చెల్లించే సొమ్ములో 70 శాతం ఎస్క్రో ఖాతాలో భద్రంగా ఉండగా.. ఆదాయపు పన్ను రిటర్న్, ఆడిట్ బ్యాలెన్స్ షీట్స్ వంటివి వెబ్‌సైట్లలో పొందుపర్చడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే సంస్థ ఆదాయ వివరాలు బహిర్గతమై రకరకాల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. పైగా ఈ తరహా నిబంధనతో చిన్న, మధ్యస్త డెవలపర్లు ఇబ్బందులకు లోనవుతారు. ఎదగలేరు కూడా. ఆయా వివరాలు రెరా ట్రిబ్యునల్‌కు మాకెలాంటి ఇబ్బంది లేదు