పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సరళి తదితర అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా...
నేడు (సోమవారం) ఫిబ్రవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. గత ఏడాది డిసెంబర్‌లో 5.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 5.07 శాతానికి తగ్గింది. ఇక గత ఏడాది డిసెంబర్‌లో ఐఐపీ 7.1 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో ఐఐపీ 6.3–6.4 శాతం రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇక ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు (డబ్ల్యూపీఐ) ఈ నెల 14న(బుధవారం) వెలువడతాయి.
ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూపీఐ 2.84 శాతంగా ఉంది. సోమవారం వాణిజ్య లోటు గణాంకాలు, మంగళవారం (ఈ నెల 13న) క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాంకాలు వస్తాయి. ఐఐపీ, రిటైల్‌ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 4.74 శాతానికి దిగి వస్తుందన్న అంచనాలున్నాయని ఆయన అన్నారు.
ఐఐపీ, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రతికూలంగా ఉంటే మార్కెట్ పతనమవుతుందని ఎపిక్ రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్తఫా నదీమ్ చెప్పారు. ఐఐపీ, రిటైల్ గణాంకాల ప్రభావం బ్యాంక్ నిఫ్టీపై అధికంగా ఉంటుందని, ఈ సూచీ 200 రోజుల సగటు కంటే దిగువకు ట్రేడవుతోందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ వికాస్ జైన్ చెప్పారు. వాహన, ప్రైవేట్ బ్యాంక్, కన్సూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు సానుకూలంగా చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
బలహీనతలు కొనసాగుతాయ్...
గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అమెరికా మార్కెట్ భారీగా లాభపడిందని, దీంతో ఈ సోమవారం మన మార్కెట్ సానుకూలంగానే ఆరంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారంలో బలహీనతలు కొనసాగుతాయని, కన్సాలిడేషన్ కొనసాగుతుందని వారంటున్నారు.
స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని, అయితే బ్యాంక్ రుణ కుంభకోణాలకు సంబంధించి కొత్త అంశాలు వెల్లడైతే మాత్రం అమ్మకాలు వెల్లువెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు సంబంధించి ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్‌పై ఈడీ చార్జ్‌షీట్ వేయడం, రూ.50 కోట్లకు మించిన బ్యాంక్ రుణాలకు సంబంధించి బ్యాంక్ పుస్తకాలను తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.
ఈ వారంలో మూడు ఐపీఓలు
ఈ వారంలో మూడు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లు రానున్నాయి. భారత్ డైనమిక్స్ ఐపీఓ ఈ నెల 13న(మంగళవారం) ఆరంభమై 15న ముగుస్తుంది. ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.413–428గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.961 కోట్ల మేర సమీకరించనుంది. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
బంధన్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 15న(గురువారం) ఆరంభమై ఈ నెల 19న ముగుస్తుంది. రూ.370–375 ధర శ్రేణితో ఈ బ్యాంక్ రూ.4,473 కోట్లు సమీకరించనున్నది. కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఐపీఓ ఈ నెల 16(శుక్రవారం) ప్రారంభమై 21న ముగుస్తుంది. రూ.1,215–1,240 ప్రైస్‌బాండ్‌తో రూ.4,482 కోట్లు సమీకరిస్తుంది.
ఈ వారం ఈవెంట్స్
12 సోమ - జనవరి ఐఐపీ గణాంకాలు ,ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణగణాంకాలు , వాణిజ్య లోటు వివరాలు
13 మంగళ - క్యూ4 కరంట్ అకౌంట్ లోటు గణాకాలు
14 బుధ - ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ వివరాలు
Comments
Please login to add a commentAdd a comment