ఫలితాలు, గణాంకాలే దిక్సూచి | Experts on the market this week | Sakshi
Sakshi News home page

ఫలితాలు, గణాంకాలే దిక్సూచి

Published Mon, Oct 9 2017 1:18 AM | Last Updated on Mon, Oct 9 2017 1:18 AM

Experts on the market this week

ఈ వారం నుంచి కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ నెల 12న (గురువారం) వెలువడే ఐటీ దిగ్గజం టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు, అదే రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌ను ప్రభావం చూపే కీలకాంశాలని నిపుణులంటున్నారు.

వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, వీటికి ప్రపంచ మార్కెట్లు స్పందించే తీరు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఇతర కమొడిటీల ధరలు తదితర అంశాలు కూడా స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.  

ఈ వారంలో దాదాపు 30కు పైగా కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నెల 12న టీసీఎస్‌ ఫలితాలు వస్తాయి. అదే రోజు బజాజ్‌ కార్ప్, సైయంట్, ఇండస్‌ఇంద్‌ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా ఫలితాలు వస్తాయి. ఇక శుక్రవారం(13న) రిలయన్స్‌ ఇండస్ట్రీస్, కర్ణాటక బ్యాంక్, ఎంసీఎక్స్‌ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. ఈ నెల 10న (మంగళవారం)సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాలు  వస్తాయి.  

11న ఫెడ్‌ మినిట్స్‌...
సమీప భవిష్యత్తులో మార్కెట్‌ గమనాన్ని కంపెనీల క్యూ2 ఫలితాలు నిర్దేశిస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇక ఈ వారానికి పారిశ్రామికోత్పత్తి,  రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు గమనించాల్సిన ముఖ్యాంశాలని వివరించారు.

ఇటీవల జరిగిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు (మినట్స్‌) ఈ నెల 11న(బుధవారం) వెల్లడవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్‌ హెడ్‌ వి.కె. శర్మ పేర్కొన్నారు. ఈ సమావేశ వివరాలు ఎలా ఉన్నాయో అన్న విషయానికి కాక ఈ వివరాలకు అమెరికా మార్కెట్‌ స్పందనను బట్టి మన మార్కెట్‌ స్పందన  ఉంటుందని వివరించారు. జీఎస్‌టీకి సంబంధించి కీలక నిర్ణయాల నేపథ్యంలో సోమవారం మార్కెట్‌కు ఊరట లభించగలదని ఆయన అంచనా వేస్తున్నారు.  

అంతంత మాత్రంగానే ఫలితాలు..!
వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మార్కెట్‌  దృష్టి ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(పీసీజీ రీసెర్చ్‌) సంజీవ్‌ జర్బాడే తెలిపారు. కంపెనీల క్యూ2 ఫలితాలు కూడా కీలకమైనని పేర్కొన్నారు.జీఎస్‌టీ అమలు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయని జైఫిన్‌  అడ్వైజర్స్‌ సీఈఓ దేవేంద్ర నేగి చెప్పారు.

భారత ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉన్నాయని, మన మార్కెట్‌ వాల్యూయేషన్‌ అధికంగా ఉందని.. ఈ అంశాలు మన మార్కెట్‌ జోరుకు కళ్లెం వేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.  గత శుక్రవారం నిఫ్టీ బాగా పెరగడంతో ఈ వారం ప్రారంభంలో నిఫ్టీ మరింతగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసానీ చెప్పారు. నిఫ్టీ 9,980–10,000 పాయింట్లను అధిగమించగలిగితే,  1–2 వారాల్లోనే నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై(10,179)ను అధిగమించే అవకాశాలున్నాయని వివరించారు.  కాగా గత వారంలో సెన్సెక్స్‌ 530 పాయింట్లు (1.69 శాతం), నిఫ్టీ 191 పాయింట్లు(1.95 శాతం) చొప్పున లాభపడ్డాయి.

కాగా ఈ నెల 3–6 కాలానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) నికరంగా రూ.551 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆర్థిక వృద్ధి్ద మందగించడం, వాల్యూయేషన్లు అధికంగా ఉండటంతో గత రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కితీసుకున్నారని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ అనింద్య బెనర్జీ చెప్పారు. అయితే, డెట్‌ మార్కెట్లో మాత్రం విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది.  ఎఫ్‌పీఐలు ఈ నెల 3–6 మధ్య డెట్‌ మార్కెట్లో రూ.4,886 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు.
కొనసాగుతున్న విదేశీ విక్రయాలు


ఈ వారం రెండు ఐపీఓలు..
ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నాయి. ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే్చంజ్‌ ఐపీఓ నేడు (సోమవారం) ప్రారంభమై ఈ నెల 11న ముగుస్తుంది. రూ.1,645–1,650 ప్రైస్‌బ్యాండ్‌ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,001 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓలో భాగంగా 20 శాతం వాటాకు సమానమైన 60.65 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తోంది.

యాక్సిస్‌ క్యాపిటల్, కోటక్‌  మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఇక ఈ నెల 11న ప్రారంభమై 13న ముగిసే     ఐపీఓ ద్వారా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా  రూ.11,370 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.855–912గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్‌ క్యాపిటల్, సిటీగ్రూప్, డాషే ఇండియా, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, కోటక్‌ క్యాపిటల్‌ సంస్థలు ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement