ఈ-కామర్స్‌లోకి ఫేస్‌బుక్..!
షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ కొనుగోలు
హ్యూస్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్.. ఇక ఈ-కామర్స్ రంగంలోనూ తన సత్తా చాటనుంది. దీనిలో భాగంగానే షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ను చేజిక్కించుకుంది. అయితే, ఇందుకు ఎంత మొత్తాన్ని వెచ్చించిందో ఫేస్‌బుక్ వెల్లడించలేదు. ఇంటర్నెట్ వ్యాపార మార్కెట్లో అతికీలకమైన సెర్చ్.. ఈ-కామర్స్ రంగాల్లో అడుగుపెట్టడమే ఫేస్‌బుక్ తాజా టేకోవర్ ప్రధానోద్దేశంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతేకాకుండా ఫేస్‌బుక్ డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత పెంచడంలో కూడా ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
గతేడాది యాడ్‌ల రూపంలో ఫేస్‌బుక్‌కు 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ఇప్పుడు తమ ఇరు కంపెనీల కలయికతో యూజర్ల అవసరాలకు సంబంధించిన యాడ్‌లను మరింత మెరుగ్గా అందించగలుగుతామని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోని ఏ ఉత్పత్తినైనా అన్వేషించేందుకు వీలుకల్పించేలా 2006లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దఫైండ్.కామ్ ఆవిర్భవించింది. దీని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శివ కుమార్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) శశికాంత్ ఖండేల్వాల్ ఇద్దరూ భారతీయులే కావడం గమనార్హం.