320 కోట్లకు చేరిన ఇంటర్నెట్ యూజర్స్
హైదరాబాద్: ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారులు 30 కోట్ల నుంచి 320 కోట్లకు పెరిగారని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో ఇది 43 శాతమని స్టేట్ ఆఫ్ కనెక్టివిటీ- 2015 పేరుతో విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. అందుబాటులోని డేటా ప్యాకేజీలు, ఆదాయాల పెరుగుదల ఇంటర్నెట్ వినియోగానికి దోహదంచేస్తున్నాయని తెలిపింది. 2014 చివరిలో ఈ వినియోగదారులు 290 కోట్లుగా ఉన్నారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్న మొబైల్ ఫోన్లలోనే చాలామంది ఇంటర్నెట్‌ను వాడుతున్నారని పేర్కొంది. ప్రపంచంలో 270 కోట్ల జనాభా ఇంకా ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారని నివేదించింది. 2014లో మొబైల్ బ్రాడ్‌బాండ్ కవరేజ్‌కు దూరంగా ఉన్న 200 కోట్ల జనాభా, ప్రస్తుతం 160 కోట్లకు తగ్గిందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తోందని.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువగా ఇంటర్నెట్‌ను వాడుతున్నారని ఫేస్‌బుక్ నివేదిక వెల్లడించింది.