
మూడేళ్ల కనిష్టస్థాయి నుంచి డాలరు రికవరీకావడంతో గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర హఠాత్ పతనాన్ని చవిచూసింది. వారంవారంగా 27 డాలర్లు నష్టపోయి 1,330 డాలర్ల వద్ద ముగిసింది. ఒకదశలో ఇది 1,325 డాలర్లకు సైతం పడిపోయింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ ఈ వారంలో అమెరికా కాంగ్రెస్ ముందు చేసే ప్రసంగం ఆధారంగా సమీప భవిష్యత్తులో పసిడి ట్రెండ్ వుండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వడ్డీ రేట్ల పెరుగుదల నెమ్మదిగా వుండవచ్చన్న సంకేతాల్ని ఆయన వెల్లడిస్తే పసిడి క్రమేపీ పుంజుకుంటుందని, వడ్డీ రేట్ల పట్ల కఠిన వైఖరిని పొవెల్ ప్రదర్శిస్తే బంగారం ధర మరికాస్త తగ్గవచ్చని విశ్లేషకులు వారి అంచనాల్లో పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం వుందని, ఈ కారణంగా ద్రవ్యోల్బణానికి రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారం ప్రస్తుతస్థాయి నుంచి భారీగా పతనమయ్యే అవకాశం లేదని వారు అంటున్నారు. సాంకేతికంగా 1,305, 1,290 స్థాయిల వద్ద పసిడి ఫ్యూచర్లకు మద్దతు లభిస్తున్నదని, 1,360, 1,375 స్థాయిల వద్ద అవరోధం కలగవచ్చని అనలిస్టులు అంచనావేస్తున్నారు.
దేశీయంగా రూ.300కుపైగా పతనం...
ఇక దేశీయంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఇక్కడా కనిపించింది. అయితే ప్రపంచ మార్కెట్లో 2 శాతం వరకూ పసిడి తగ్గినప్పటికీ, ఇక్కడ మాత్రం క్షీణత 1 శాతానికే పరిమితమయ్యింది. రూపాయి భారీగా తగ్గిన కారణంగా, దేశీయంగా పసిడి పతనం అల్పంగా వుంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 300 తగ్గి, రూ.30,509కి చేరింది.
ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర రూ. 345 నష్టంతో రూ.30,570కు పడింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో తగ్గి రూ. 30,420కు చేరింది. వెండి కేజీ ధర భారీగా రూ.320 నష్టపోయి, రూ.38,390కి చేరింది. ఇక వారం వారీగా అంతర్జాతీయంగా రూపాయి డాలర్ మారకంలో బలహీనపడి 64.90 వద్ద ముగిసింది. 16వ తేదీతో ముగిసిన వారంలో ఈ విలువ 64.60 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment