ఫీచర్ ఫోన్ ధరకే 3జీ స్మార్ట్ ఫోన్..
⇒ రూ.2,345లకే సెల్‌కాన్ ఏ359
⇒ 16 జీబీ మెమరీతో బేసిక్ ఫోన్లు
⇒ సెల్‌కాన్ సీఎండీ వై.గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్.. క్యాంపస్ ఏ359 పేరుతో రూ.2,345లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఫీచర్ ఫోన్ ధరలో 3జీ మోడల్‌ను తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలో తమదేనని సెల్‌కాన్ సీఎండీ వై.గురు శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. యువత కోసం 11 రంగుల్లో ఈ మోడల్‌ను విడుదల చేశామన్నారు.
దుబాయితోసహా పలు దేశాలకు ఏ359ను ఎగుమతి చేస్తామని చెప్పారు. మూడు నెలల్లో దేశీయ మార్కెట్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక క్యాంపస్ ఏ359లో 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, కిట్‌క్యాట్ ఓఎస్, 2 ఎంపీ కెమెరా, వైఫై, జి-సెన్సార్, 1,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెమరీ కార్డులో 35,000 పాటలు..: ఫీచర్ ఫోన్ విభాగంలో సెల్‌కాన్ 2.4 అంగుళాల స్క్రీన్‌తో సి-27 మోడల్, 2.8 అంగుళాల స్క్రీన్‌తో సి-287 మోడల్‌ను ప్రవేశపెట్టింది. వీటి ధరలు వరుసగా రూ.1,650, రూ.1,800. 16 జీబీ మెమరీ కార్డును జోడించడం వీటి ప్రత్యేకత. మెమరీ కార్డులో 35,000ల పాటలను భద్రపర్చుకోవచ్చు. ఎఫ్‌ఎం సదుపాయం లేని ప్రాంతాల్లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చామని గురు తెలిపారు. ‘రూ.5 వేలకే డ్యూయల్ సిమ్ హెచ్‌డీ ట్యాబ్‌ను మార్కెట్లోకి తెచ్చాం. నెలరోజుల్లో 15 ఫోన్లను ప్రవేశపెడతాం. వీటిలో లాలిపాప్ ఓఎస్‌తోనూ మోడళ్లుంటాయి’ అని వివరించారు.
జూన్‌లో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్..
అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు పనులను సెల్‌కాన్ వేగిరం చేసింది. జూన్‌లో సెల్‌కాన్ మేక్ ఇన్ ఇండియా మొబైల్‌ను తీసుకు రావాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు వై.గురు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. అయితే ప్లాంట్ల ఏర్పాటుకు ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలతోనూ సెల్‌కాన్ చర్చిస్తోంది. 3 కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరిచాయి. ప్లాంటు ఎక్కడ ఏర్పాటయ్యేది ఈ నెలలోనే ఖరారయ్యే అవకాశం ఉంది.