
ఫెడరల్ బ్యాంక్ లాభం 25 రెట్లు అప్
తగ్గిన నికర మొండి బకాయిలు
ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో దాదాపు 25 రెట్లు పెరిగింది. 2015–16 క్యూ4లో రూ.10 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17 క్యూ4లో రూ.257 కోట్లకు పెరిగిందని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. నికర మొండి బకాయిలు తగ్గడం.. రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాల మంచి పనితీరుతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామశ్రీనివాసన్ చెప్పారు. ఆదాయం రూ.2,263 కోట్ల నుంచి రూ.2,598 కోట్లకు పెరిగిందన్నారు. ఒక్కో షేర్‌కు 90 పైసలు (45%) డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
రూ.2,500 కోట్లు సమీకరణ: రూ.2,500 కోట్ల మూలధన నిధులు సమీకరించడానికి తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ఎఫ్‌పీఓ, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్).. ఇలా వివిధ మార్గాల్లో ఈ నిధులను సమీకరించనున్నామని చెప్పారు. మొత్తం విదేశీ వాటాను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని తెలిపారు. బీఎస్‌ఈలో ఫెడరల్ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.109ను తాకింది. చివరకు 14 శాతం లాభంతో రూ.108 వద్ద ముగిసింది.