జీప్ మోడల్ ధర తగ్గించిన ఫియట్
రూ.18.49 లక్షల వరకు కోత
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్‌సీఏ) తాజాగా తన జీప్ మోడల్ వాహన ధరలను రూ.18.49 లక్షల వరకు తగ్గించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. డీజిల్ ఇంజిన్ రాంగ్లర్ (ఆన్‌లిమిటెడ్) ధరను రూ.7.14 లక్షల మేర తగ్గించింది. దీంతో దీని ధర రూ.71.59 లక్షల నుంచి రూ.64.45 లక్షలకు తగ్గింది.
గ్రాండ్ చెరోకీ (లిమిటెడ్) డీజిల్ వేరియంట్ ధరలో ఏకంగా రూ.18.49 లక్షలు కోత విధించింది. దీంతో దీని ధర రూ.93.64 లక్షల నుంచి రూ.75.15 లక్షలకు దిగివచ్చింది. డీజిల్ ఇంజిన్ గ్రాండ్ చెరోకీ (సమిట్) ధర కూడా రూ.18.24 లక్షలు తగ్గింది. దీని ధర రూ.1.03 కోట్ల నుంచి రూ.85.15 లక్షలకు దిగివచ్చింది. గ్రాండ్ చెరోకీ ఎస్‌ఆర్‌టీ ధరలో రూ.5 లక్షల కోత విధించింది. దీంతో దీని ధర రూ.1.07 కోట్లుగా ఉంది. ఇక పెట్రోల్ ఇంజిన్ రాంగ్లర్ (అన్‌లిమిటెడ్) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీని ధర రూ.56 లక్షలుగానే ఉంది. కాగా కంపెనీ తాజాగా గ్రాండ్ చెరోకీ మోడల్‌లో పెట్రోల్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.75.15 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.