సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పరిశ్రమ సంస్థ ఫిక్కీ సర్వేలో వెల్లడైంది. గత కొద్దివారాలుగా మహమ్మారి ప్రభావంతో అంచనాలకు మించి ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, భవిష్యత్‌లోనూ వ్యాపారాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై కోవిడ్-19 ప్రభావంపై అనిశ్చితి నెలకొందని ఫిక్కీ-ధ్రువ సర్వే తేల్చిచెప్పింది. కరోనా మహమ్మారి తమ వ్యాపారాలపై అధిక నుంచి అత్యధిక స్ధాయి ప్రభావాన్ని చూపతోందని సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపారాలకు సానుకూల డిమాండ్ నెలకొనే పరిస్ధితి లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోతాయని 70 శాతం మంది వెల్లడించారు.
కరోనా మహమ్మారితో తమ వ్యాపారంలో నగదు ప్రవాహాలు కుచించుకుపోవడంతో పాటు ఆర్డర్లు గణనీయంగా తగ్గుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్ధిష్ట ఆర్థిక ప్యాకేజ్‌తో సత్వరమే ముందుకురాని పక్షంలో పరిశ్రమ గడ్డుపరిస్ధితిని ఎదుర్కొంటుందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్ధల్లో సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నామని సర్వే పలుకరించిన వారిలో నాలుగింట మూడొంతుల మంది వెల్లడించడంతో రాబోయే నెలల్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
చదవండి : కరోనాపై అంతుచిక్కని అంశాలు
వ్యాపారాల విస్తరణకు పలు సంస్ధలు చేపట్టిన ప్రణాళికలూ కోవిడ్ మహమ్మారితో అటకెక్కాయని సర్వేలో వెల్లడైంది. ఇక ఫిక్కీ-ధ్రువ చేపట్టిన ఈ సర్వేలో పలు రంగాలకు చెందిన 380 కంపెనీలు పాలుపంచుకున్నాయి. కోవిడ్-19 ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని, దశాబ్ధాలుగా పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్ధ సాధించిన ప్రయోజనాలను హరించివేసిందని ఫిక్కీ ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతా రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగాలు, సంస్ధలను కాపాడేందుకు పరిశ్రమను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు.
వ్యాపారాలు సజావుగా సాగేందుకు సత్వరమే ద్రవ్య సరఫరా పెంచాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించడంతో పాటు లిక్విడిటీని పెంచడం, ట్యాక్స్ రిఫండ్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని ధ్రువ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కనబర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment