ఆర్థిక రంగంపై ప్రధాని, ఆర్థిక మంత్రి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు. గత ఏడు నెలల్లో ఆర్థిక రంగం పనితీరుపై వారిరువురూ సమీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో జైట్లీ ప్రవేశపెట్టబోయే 2015-16 బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైతే చట్టాలు, నిబంధనలను మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదంటూ సోమవారంనాటి మేక్ ఇన్ ఇండియా వర్క్‌షాప్‌లో ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత కొద్ది నెలల్లో పలు సంస్కరణల్ని ప్రవేశపెట్టామని, తయారీ రంగ మందగమనాన్ని తొలగించేందుకు తగిన సంస్కరణల్ని, మార్పుల్ని తీసుకురావాల్సివుందంటూ ఇటీవల జైట్లీ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిరువురూ తాజా భేటీలో తయారీ రంగ సంస్కరణలను చర్చించివుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజన్‌పై వ్యాఖ్యలు చేయలేదు: జైట్లీ
వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై తానెటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తాను కేవలం తయారీ రంగ సామర్థ్యాలను పెంచే దిశగా తీసుకోవాల్సిన చర్యలను మాత్రమే సూచించానని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా వర్క్‌షాప్ సందర్భంగా వడ్డీ రేట్ల విషయంలో రాజన్‌ను విమర్శించినట్లు వార్తలు వచ్చిన దరిమిలా సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌లో జైట్లీ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
‘నా ప్రసంగంలో నేను ఎక్కడా కూడా రిజర్వ్ బ్యాంక్ గానీ, దాని గవర్నర్ గురించి గానీ పల్లెత్తు మాట మాట్లాడలేదు. నేను మాట్లాడని వాటిని నాకు ఆపాదిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. తయారీ రంగ సంస్థలు పెట్టుబడులు సమకూర్చుకునేలా వడ్డీ రేట్లు తగ్గాలని మాత్రమే తాను సూచించానని, భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దడంపై మాట్లాడేవారెవరైనా ఇదే మాట చెబుతారని జైట్లీ పేర్కొన్నారు.