నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి...
- బ్యాంకు చీఫ్‌లకు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచన
- ఆర్థిక అంశాల్లో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ
న్యూఢిల్లీ: ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా వ్యాపార సంబంధ నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు సూచించారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఉత్పాదక రంగాల అవసరాలకు తగిన రుణ సదుపాయాల కల్పనకూ దోహదపడాలని పిలుపునిచ్చారు.
తద్వారా దేశాభివృద్ధికి ఊతమివ్వాలని కోరారు. ఆర్థిక అంశాల్లో బ్యాంకింగ్‌కు మరింత స్వేచ్ఛ, ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల త్రైమాసిక పనితీరు అంశాలను, మొండి బకాయిల తీవ్రతను జైట్లీ బుధవారం ఇక్కడ సమీక్షించారు. ఈ సందర్భంగా జైట్లీ పేర్కొన్న ముఖ్యాంశాలు...
- కస్టమర్ల సమస్యల పరిష్కారానికి పటిష్ట యంత్రాంగాన్ని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ అంశంలో కస్టమర్లు ప్రభుత్వం వైపు చూసే ధోరణి ఉండకూడదు.
- బ్యాంకులు తమ వ్యాపార అవసరాలకు తగిన నిధులు సమకూర్చుకోవడానికి వినూత్న, విభిన్న ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రమెంట్లను (పథకాలను) ప్రవేశపెట్టాలి.
ఈ దిశలో ప్రణాళికలు రూపొందించుకోవాలి.
- ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన విజయవంతంలో బ్యాంకుల పాత్ర అత్యంత హర్షణీయం. ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను విజయవంతం చేయడంలో బ్యాంకింగ్ శక్తి సామర్థ్యాలను ఈ అంశం సూచిస్తోంది.
- బడ్జెట్‌లో ప్రకటించిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల అమలు విజయవంతం కావడంలో కూడా బ్యాంకులు తగిన కృషి చేయాలి.
- మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంకులు తమ కృషిని కొనసాగిస్తాయి.
- మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తగిన రుణ సదుపాయాలు అందడం కీలకం.
వడ్డీరేట్ల తగ్గించాలి: కేంద్రం
బ్యాంకర్లతో ఆర్థికమంత్రి సమావేశంలో వడ్డీరేట్ల కోత అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కేంద్రం అభిప్రాయాన్ని బ్యాంకర్లకు ఆర్థికశాఖ అధికారులు వివరించారని సమాచారం. వడ్డీరేట్ల కోత అంశాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయని, 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) రేట్ల కోత జరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వీఆర్ అయ్యర్ సమావేశం అనంతరం చెప్పారు. వ్యాపారాభివృద్ధి ఆయా అంశాలకు సంబంధించి తగిన మూలధనం అవసరాలకు కేపిటల్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోడానికి ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.