నిర్మలా శక్తి రామన్‌! | Finance Minister Nirmala Sitharaman on Forbes 100 most powerful women list | Sakshi
Sakshi News home page

నిర్మలా శక్తి రామన్‌!

Published Sat, Dec 14 2019 2:51 AM | Last Updated on Sat, Dec 14 2019 4:46 AM

Finance Minister Nirmala Sitharaman on Forbes 100 most powerful women list - Sakshi

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.  గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు.

కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్‌ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు ఈ  జాబితాలో స్థానం లభించింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌  ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్‌ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్‌ చీఫ్‌  కిరణ్‌ మజుందార్‌ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్‌ చైర్మన్, ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నికర సంపద  రూ.310 కోట్ల అమెరికా డాలర్లు (2019). దేశంలోనే అతిపెద్ద బయోఫార్మాసూటికల్‌ కంపెనీ ఏర్పాటుచేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రోష్ని నాడార్‌ విషయానికొస్తే, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురుణ్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ (2019) ప్రకారం,  భారత్‌లోనే అత్యంత మహిళా సంపన్నురాలు.



అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్‌
ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలోనూ జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌ టాప్‌లో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టీనా లగార్డ్‌ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్‌ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌(4 వ ర్యాంకు), జనరల్‌ మోటార్స్‌ సీఈఓ మేరీ బరా(5) బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా(29), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌(42) ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 23 మందిలో పర్యావరణ పరిక్షణకోసం గళమెత్తిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబర్గ్‌ కూడా ఉన్నారు. ఆమె 100వ స్థానంలో నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement