
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల అమలుకు కేంద్రం కసరత్తు చే స్తోంది. ఇందులో భాగంగా పది ప్రభుత్వ రంగ సంస్థల్లోని షేర్లను స్పెషల్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు (ఎస్‌ఎన్‌ఐఎఫ్) బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ రూపొందిస్తున్న ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ సంస్థల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ కనీసం 25 శాతం ఉండాలన్న సెబీ నిబంధన అమలుకు వాస్తవానికి 2017 ఆగస్టు 21తో గడువు ముగిసింది. అయితే, సెబీ దీన్ని ఆ తర్వాత మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ డెడ్‌లైన్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థల్లో వాటాల విక్రయం సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆ షేర్లను బదలాయించాలని భావిస్తోంది.
లిస్టులోని కంపెనీలవే ..
సెబీ నిబంధనల ప్రకారం కేంద్రం తన వాటాలను 75 శాతానికి తగ్గించుకోవాల్సిన పది కంపెనీల్లో కోల్ ఇండియా, ఎంఎంటీసీ మొదలైనవి ఉన్నాయి. ఐటీడీసీ, ఎంఆర్‌పీఎల్, హిందుస్తాన్ కాపర్, ఎన్‌ఎల్‌సీ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్), ఎస్‌జేవీఎన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టీసీ), కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐవోఎస్‌ఎల్), మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
ఏఎంకే నిర్ణయాధికారం ..
ఆర్థిక శాఖ రూపొందిస్తున్న నోట్ ప్రకారం చూస్తే.. ఏయే సంస్థల్లో వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించాలనే దానిపై డిజిన్వెస్ట్‌మెంట్ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి కోల్ ఇండియాలో 78.32 శాతం, ఎన్‌ఎల్‌సీలో 84.04 శాతం వాటాలు ఉన్నాయి. వీటిల్లో వాటాల విక్రయం కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే రోడ్‌షోలు నిర్వహిస్తోంది. ఇది కుదరని పక్షంలో ఎస్‌ఎన్‌ఐఎఫ్‌లోకి ఆయా వాటాల బదలాయింపుపై ఏఎం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతంలో సెబీ నిర్దేశించిన పది శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల అమలు కోసం 2013లో అప్పటి ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఏర్పాటు చేసింది. అప్పట్లో ఖాయిలాపడిన ఆరు సంస్థలు.. ఫ్యాక్ట్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్ మాన్యుఫాక్చరింగ్, హెచ్‌ఎంటీ, స్కూటర్స్ ఇండియా, ఆండ్రూ యూల్ అండ్ కంపెనీ, ఐటీఐల్లో 10 శాతం వాటాలను ఎస్‌ఎన్‌ఐఎఫ్‌కు బదలాయించింది.
తాజాగా కొత్త నిబంధనలకు డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో మరికొన్ని సంస్థల్లో మరిన్ని వాటాలను దీనికి బదలాయించాలని యోచిస్తోంది. స్వతంత్ర ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ నిర్వహణలో ఎస్‌ఎన్‌ఐఎఫ్ ఉంటుంది. ఇందులోకి బదిలీ అయిన షేర్లను అయిదేళ్ల వ్యవధిలోగా విక్రయించాల్సి ఉంటుంది. తద్వారా వచ్చిన నిధులను సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వినియోగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment