ఐపీఓకు రెండు రైల్వే ఇంజనీరింగ్ కంపెనీలు
ఇష్యూ ధరలో రైల్వే ఉద్యోగులకు,
రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్
న్యూఢిల్లీ: రెండు రైల్ ఇంజనీరింగ్ కంపెనీలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఆర్‌ఐటీఈఎస్, ఆర్‌వీఎన్‌ఎల్.. ఈ రెండు కంపెనీల ఐపీఓల నిర్వహణకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనుంది. ఐదు రైల్వే పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని గత వారం కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఆర్‌ఐటీఈఎస్, ఆర్‌వీఎన్‌ఎల్‌లతో పాటు ఇర్‌కాన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొ(ఐఆర్‌ఎఫ్‌సీ), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌సీటీసీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా ఈ రైల్వే ఐపీఓలకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌తో సహా తొమ్మిది సంస్థలు ముందుకు వచ్చాయని సమాచారం. కొన్ని షేర్లను రైల్వే ఉద్యోగులకు కేటాయించనున్నారు. రైల్వే ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో కొంత డిస్కౌంట్ లభించనున్నది.
ఆర్‌ఐటీఈఎస్: ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గతేడాది రూ.339 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కంపెనీ నెట్‌వర్త్ రూ.1,803 కోట్లుగా ఉంది. ఆర్‌వీఎన్‌ఎల్: అధిక వేగమున్న రైలుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.288 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కంపెనీ నెట్‌వర్త్ రూ.2,828 కోట్లుగా ఉంది.