ఫండ్స్ నుంచి ఎప్పుడు వైదొలగాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్...
మనకు ఎన్నో ఆర్థిక లక్ష్యాలుంటాయి. రిటైర్మెంట్ ప్లాన్, పిల్లల చదువు, అమ్మాయి పెళ్లి ఇలా ఎన్నో అవసరాల కోసం ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. లక్ష్యాల సాకారానికి చాలా మంది వీటిల్లో పెట్టుబడులు పెడుతుం టారు. ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి బాగా తెలిసిన వారు వాటిల్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టకపోయినా మంచి రాబడి పొందొచ్చు. ఇక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేశామనే దాని కన్నా .. ఎలాంటప్పుడు (మార్కెట్ పరిస్థితులు) ఇన్వెస్ట్ చేశావనే అంశానికి ప్రాధాన్యమివ్వాలి.
లక్ష్యాలపై దృష్టి అవసరం
సాధారణంగా అయితే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు రావాలి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలానికి ప్రణాళికలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ తొలినాళ్లలోనే ఈక్విటీ ఫండ్స్‌కి అధిక ప్రాధాన్యతనివ్వాలి. కొద్ది కాలం తర్వాత పోర్ట్‌ఫోలియోను రీ–బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అంటే రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇక ఒక్కొక్కసారి నిర్దేశిత కాలం కన్నా ముందుగానే ఫండ్స్ నుంచి వైదొలగాల్సి వస్తుంటుంది. అంటే మన ఫండ్ మంచి పనితీరు కనబరచనప్పుడు, ఫండ్ హౌస్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలు మారినప్పుడు మనం ఫండ్ నుంచి బయటకు వచ్చేయాలని యోచి స్తాం. మనకు ఏది మంచో ఏది చెడో మనకే తెలుస్తుంది. అందుకే ఇలాంటప్పుడు మనకు అనువైన నిర్ణయాన్నే తీసుకోవాలి.
ప్రశ్నలకు సమాధానాలుండాలి
ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి వైదొలగాలి అని అనుకున్నప్పుడు ఒకే ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు వైదొలుగుతున్నాం అనే ప్రశ్నకు మన వద్ద సరైన సమాధానం ఉండేలా చూసుకోవాలి. ఫండ్ నుంచి బయటకు రావడానికి ముందే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశోధించాలి. అంటే స్థిరం గా ఉండి, దీర్ఘకాలంలో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. ఎలాంటి ప్రతిఫలం పొందొచ్చు ఊహించగలగాలి. దీర్ఘకాలంలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అలాగే కాంపౌండింగ్ అంశం వల్లా లబ్ధి పొందొచ్చు.