ఫైనాన్షియల్ బేసిక్స్...
పోర్ట్‌ఫోలియో అంటే?
ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన పద్దునే స్థూలంగా పోర్ట్‌ఫోలియోగా చెప్పుకోవచ్చు. ఇందులో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లు తదితర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉండొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ద్వారా మొత్తం పెట్టుబడులపై ఒక అవగాహనకు రావొచ్చు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల పనితీరును నిశితంగా గమనించవచ్చు. పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
మనం ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఆర్థిక లక్ష్యాల సాకారం కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ ఆర్థిక లక్ష్యాలేంటి? ఇందులో సొంతిళ్లు, కారు, పిల్లల చదువు, రిటైర్మెంట్ వంటివి ఉండొచ్చు. ముందుగా ఇలాంటి అంశాలపై ఒక అంచనాకు రావాలి. అంటే నిర్ణీత కాలానికి సంబంధించి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. తర్వాత మనం ఎంత స్థాయిలో రిస్క్‌ను భరించగలుగుతామో చూసుకోవాలి. ఈ రెండు విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కు సిద్ధం కావాలి. లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. మార్కెట్‌లో స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ వంటి పలు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఉన్నాయి. వీటిలో మనకు అనువైన వాటిని ఎంచుకొని వాటిల్లో పెట్టుబడి పెట్టాలి. అంటే ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరగాలి. అంతేతప్ప పెట్టుబడులను అనుసరించి లక్ష్యాలను ఎప్పటికీ నిర్దేశించుకోవద్దు.